తెలంగాణ

telangana

ETV Bharat / sports

అగ్రజట్టుకు బంగ్లా పోటీ ఏమాత్రమో..!

భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ఇండోర్ వేదికగా నేడు ప్రారంభంకానుంది. టీ20 సిరీస్​లో విజయం సాధించిన టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్​లోనూ సత్తాచాటాలని భావిస్తోంది. భారత గడ్డపై ఇప్పటికి ఒక్క టెస్టు కూడా గెలవని బంగ్లా.. ఈసారి ఎలాగైనా గెలవాలని కోరుకుంటోంది.

By

Published : Nov 14, 2019, 6:46 AM IST

క్రికెట్

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య టీ20 సిరీస్‌ ముగియగా టెస్టు సమరం కోసం ఇరుజట్లు సిద్ధమయ్యాయి. నేడు ఇండోర్‌ వేదికగా తొలిటెస్టు ప్రారంభంకానుంది. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాకు గట్టిపోటీ ఇచ్చిన బంగ్లాకు టెస్టుల్లో నెగ్గుకు రావడం అంత సులభం కాదు. చరిత్ర చూసుకున్నా.. రికార్డుల లెక్కలు తీసినా భారత్‌ చేతిలో బంగ్లాకు ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది. అద్భుత ఫామ్‌తో టెస్టు క్రికెట్‌ను శాసిస్తున్న టీమిండియాను ఎదుర్కొని బంగ్లాదేశ్‌ నిలవగలదా. ఎంత మేరకు పోటీ ఇవ్వగలదు అనేది తేలాల్సి ఉంది.

బౌలర్లదే ఆధిపత్యమా..!

బంగ్లాదేశ్‌తో భారత్‌ టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. టీ20లో ఊహించిన దానికంటే బంగ్లా పులులు గట్టిగానే పోరాడారు. ఈ సిరీస్‌లో తొలిమ్యాచ్‌లో ఓడినా అనంతరం పుంజుకున్న భారత్‌ 2-1తో ట్రోఫీ సొంతం చేసుకుంది. అయితే గురువారం ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌ బంగ్లా జట్టుకు పెద్ద పరీక్ష పెట్టనుంది. ముఖ్యంగా భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడం బంగ్లాకు సవాలే. బుమ్రా లేకపోయినా మహ్మద్‌ షమీ, ఇషాంత్‌శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లతో భారత పేస్‌ విభాగం బలంగా ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అద్భుత బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన పేసర్లు.. మరోసారి పంజా విసిరేందుకు సిద్ధం అవుతున్నారు.

బ్యాట్స్​మెన్​కు తిరుగుందా..!

బ్యాటింగ్‌ విభాగంలోనూ టీమిండియా దుర్బేద్యంగా కనిపిస్తోంది. భారత ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ అద్భుత ఫామ్‌లో ఉండగా.. పుజారా, కోహ్లీ, రహానేలతో మిడిలార్డర్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది. వృద్ధిమాన్‌ సాహా వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వహించనున్నాడు. పేస్‌ విభాగంలో మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఖాయంకాగా స్పిన్‌ బాధ్యతలను రవీంద్ర జడేజా, రవిచందర్‌ అశ్విన్‌ పంచుకోనున్నారు. పిచ్‌పై బౌన్స్‌ ఉంటే స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌ బదులు మూడో పేసర్‌గా ఇషాంత్‌శర్మను ఆడించే అవకాశం ఉంది.

బంగ్లా కల నెలవేరేనా..!

భారత్‌తో ఇప్పటిదాకా ఆరు టెస్టు సిరీస్‌లలో తలపడ్డ బంగ్లాదేశ్‌ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. సిరీస్‌ సంగతి పక్కనపెడితే ఒక్క మ్యాచ్‌లోనూ బంగ్లా నెగ్గలేకపోయింది. 2000లో తొలిసారి ఈ రెండు జట్లు సిరీస్‌ ఆడగా భారత్‌ 1-0తో గెలిచింది. 2015లో ఏకైక టెస్టు సిరీస్‌ను 0-0తో డ్రా చేసుకోవడం ఒక్కటే ఇప్పటిదాకా ఆ జట్టు ఉత్తమ ప్రదర్శన. చివరిగా 2017లో హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో భారత్‌ నెగ్గింది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు మ్యాచ్‌ల పోరుకు సిద్ధమైన బంగ్లా.. సిరీస్‌ను డ్రా చేసుకున్నా గొప్ప విషయమే. కానీ ఇటీవల టెస్టుల్లో భారత జోరు చూస్తుంటే బంగ్లా ఎదురు నిలవడం కష్టంగానే కనిపిస్తోంది. సారథి మోమినుల్‌ హక్‌, ముష్ఫికర్‌ రహీం, మహ్మదుల్లా రియాద్‌ మంచి ప్రతిభ చూపాలని బంగ్లా జట్టు కోరుకుంటోంది.

భారత్‌-బంగ్లా తొలి టెస్టు కోసం సిద్ధం చేసిన పిచ్‌ అందరికీ సహకరిస్తుందని పిచ్‌ క్యురేటర్‌ తెలిపాడు. ఈ పిచ్‌ ఐదు రోజులూ అటు బ్యాట్స్‌మన్‌కు, ఇటు బౌలర్లకు సమానంగా సహకరించేలా ఉంటుందని వెల్లడించాడు. గురువారం ఉదయం తొమ్మిదిన్నరకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

ఇవీ చూడండి.. ఐపీఎల్: ముంబయికి బౌల్ట్.. రాజస్థాన్​కు అంకిత్

ABOUT THE AUTHOR

...view details