న్యూజిలాండ్ పర్యటనలో వారం రోజుల ముందు టీ20 సిరీస్‌ను 5-0తో ఊడ్చేసిన భారత్... ఇప్పుడు వన్డే సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌కు గురయ్యే ప్రమాదంలో ఉంది. విచిత్రం ఏంటంటే? ఆతిథ్య జట్టును టీమిండియా ఎక్కడైతే క్లీన్‌స్వీప్ చేసిందో కథ మళ్లీ అక్కడికే చేరుకుంది. మరి పరుగుల వరద పారే మౌంట్ మాంగనూయ్‌లో మంగళవారం కోహ్లీసేన నిలిచేనా? చివరి మ్యాచ్ నెగ్గి పరువు నిలుపుకునేనా? లేదో చూడాలి.
వారం రోజుల్లో పరిస్థితి అటుఇటైంది. వరుస విజయాలతో జైత్రయాత్ర సాగించిన కోహ్లీసేన.. హఠాత్తుగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. తిరుగులేదనుకున్న జట్టు.. బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాలతో వన్డే సిరీస్‌లో 0-2తో వెనకబడి నిరాశపరిచింది. ఆఖరి వన్డేలోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సిరీస్‌లో రోహిత్‌శర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ధావన్ లేడు. కీపింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ ఐదో స్థానానికి వెళ్లాడు. కొత్త ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందిస్తున్నా, భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నారు. పరుగుల భారమంతా సారథి కోహ్లీపైనే పడింది. కివీస్ బౌలర్లు అతడు ఎక్కువ పరుగులు చేయకుండా విజయవంతంగా అడ్డుకోవడం వల్ల అర్థంకాని పరిస్థితి నెలకొంది.