కంగారూల గడ్డపై అరంగేట్రం అంటే ఓ ఘనతగా భావిస్తుంటారు. అందులోనూ టెస్టు ఫార్మాట్‌లో తొలి మ్యాచ్ అంటే గర్వంగా ఫీలవుతుంటారు. ఆసీస్ భీకర పేసర్లను ఎలా ఎదుర్కోవాలన్న కంగారు, బెదురు కూడా ఉంటాయి. కానీ యువఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లో అలాంటిదేమీ కనిపించలేదు. బౌలర్లను ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా ఎదుర్కొంటూ నిలకడగా పరుగులు సాధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్, మైకేల్ వాన్ అతడిని ప్రశంసించారు.
"కెరీర్‌లో రెండో టెస్టు మ్యాచే ఆడుతున్నప్పటికీ సిడ్నీ పిచ్‌పై ఎలాంటి తడబాటు లేకుండా పరుగులు చేస్తున్నాడు. చక్కని డిఫెన్స్, సానుకూల ధోరణితో స్ట్రోక్‌ప్లే, షాట్ల ఎంపికపై స్పష్టత అతడి సొంతం. భారత్ తరఫున అన్నిఫార్మాట్లలో అతడికి కచ్చితంగా గొప్ప భవిష్యత్ ఉంటుంది" అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
"మీరు వాదించొచ్చు. కానీ టెస్టు క్రికెట్లో రానున్న రోజుల్లో గిల్ ఉత్తమ స్థానానికి చేరుకుంటాడు. టెక్నికల్‌గానూ అతడి ఆట బాగుంది" అని వాన్ అన్నాడు.