టీమ్ఇండియాతో జరగనున్న తొలిటెస్టు కోసం ఆస్ట్రేలియా అత్యుత్తమ జట్టుని ఎంచుకున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఈ జట్టుకు టిమ్ పైన్‌ను కెప్టెన్‌గా నియమించాడు. అయితే ఇందులో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. వార్నర్ స్థానంలో మాథ్యూ వేడ్‌ను ఓపెనర్‌గా.. మిడిల్ ఆర్డర్లో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లను తీసుకున్నాడు.
"గత టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేయని కారణంగా అతడిని(జో బర్న్స్) ఎందుకు ఎంపిక చేశావని పలువురు అడిగారు. చివరి టెస్టు మ్యాచ్‌లో అతడు 40 పరుగులు చేశాడు. నాలుగు టెస్టు సెంచరీలను సాధించి.. 40 యావరేజ్‌తో ఉన్నాడు. అందుకే తన ఆటపై నమ్మకంతో తీసుకున్నా. వేడ్‌ను ఓపెనర్‌గా ఎందుకు ఎంపిక చేశానంటే.. రైట్ ఆర్మ్ బౌలర్‌తో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కాంబినేషన్ బాగుంటుంది. భారత జట్టుతో చివరిసారిగా ఆడినపుడు మన జట్టు టాప్ఆర్డర్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉండేవారు. వారిని భారత బౌలర్లు కట్టడి చేశారు. అందుకే ఎంపికలో ఇలా మార్పులు చేశా."