తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూపర్ ఓవర్​పై ఐసీసీ 'సూపర్'​ నిర్ణయం

ప్రపంచకప్ సెమీస్, ఫైనల్లో సూపర్ ​ఓవర్ టైగా మారితే.. బౌండరి లెక్కింపు విధానం బదులు మళ్లీ సూపర్ ఓవర్ నిర్వహిస్తామని చెప్పింది ఐసీసీ. అంతేకాకుండా ఏటా టీ20 ప్రపంచకప్, మూడేళ్లకోసారి వరల్డ్​​కప్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ముందుకు తీసుకొచ్చింది.

సూపర్​ ఓవర్​

By

Published : Oct 15, 2019, 7:30 AM IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కొన్ని కీలక నిబంధనలను తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రపంచకప్‌ సెమీస్‌, పైనల్లో సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించబోమని తెలిపింది. స్పష్టమైన విజేత తేలేవరకు సూపర్‌ ఓవర్లు ఆడిస్తామని స్పష్టం చేసింది. ఏటా టీ20 ప్రపంచకప్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది ఐసీసీ.

సోమవారం జరిగిన సమావేశంలో ఐసీసీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీల లెక్కను బట్టి విజేతను నిర్ణయించేవారు. ఇటీవల ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌టైగా అవ్వడం వల్ల ఇరుజట్లకు సూపర్‌ ఓవర్‌ ఆడించారు. కానీ సూపర్‌ఓవర్‌లో కూడా ఇరు జట్ల స్కోరు సమమైన కారణంగా అధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిర్ణయించారు.

ఐసీసీ నిబంధనలపై క్రికెటర్లు, మాజీలు, అభిమానులు పెద్దఎత్తున విమర్శించారు. ఈ అంశంపై అనిల్‌కుంబ్లే నేతృత్వంలో సూపర్‌ఓవర్ నిబంధనలపై ఐసీసీ కమిటీని నియమించింది. కుంబ్లే కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఏటా టీ20 ప్రపంచకప్​...

సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలో బాధ్యతలు స్వీకరించనున్న బీసీసీఐ కొత్త పాలకవర్గానికి ఆదిలోనే పెద్ద సవాల్‌ ఎదురుకానుంది. ఐసీసీతో ఘర్షణ తప్పకపోవచ్చు. ఐసీసీ ప్రతిపాదించిన భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ 2023-2028)) వల్ల బోర్డు ఆదాయానికి గండిపడనుండడమే అందుకు కారణం. మీడియా హక్కుల రూపంలో భారీగా ఆర్జించాలనుకుంటున్న ఐసీసీ ప్రతి ఏడాదీ టీ20 ప్రపంచకప్‌, ప్రతి మూడేళ్లకోసారి వన్డే ప్రపంచకప్‌ నిర్వహించాలని ప్రతిపాదించింది.

ఏటా టీ20 ప్రపంచకప్​...

ఐసీసీ, సభ్య దేశాలు వేరువేరుగా ఎఫ్‌టీపీని సిద్ధం చేస్తాయి. ఇందులో భాగంగా బహుళ దేశాల టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లను దాదాపుగా ఖరారు చేస్తారు. తమ ఆదాయానికి గండిపడుతుందన్న ఉద్దేశంతో.. ఎఫ్‌టీపీలో భాగంగా ప్రతి ఏటా టీ20 ప్రపంచకప్‌, మూడేళ్ల కోసారి వన్డే ప్రపంచకప్‌లను నిర్వహించాలన్న ఐసీసీ ముసాయిదా ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకించింది. ఇది తమకు ఆమోదయోగ్యం కాదని బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాహుల్‌ జోహ్రి.. ఐసీసీకి స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: ధోనీలో ఇంకా నైపుణ్యం ఉంది: వాట్సన్

ABOUT THE AUTHOR

...view details