ఫిబ్రవరి 13 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్టుకు కూడా చెన్నైలోని చెపాక్ స్డేడియం వేదికకానుంది. ఇటీవలే.. ఈ టెస్టుకు ప్రేక్షకులకు అనుమతినిచ్చారు. దాదాపు 15వేల మంది అభిమానులు ఈ మ్యాచును వీక్షించడానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఓ కీలక ప్రకటన జారీ చేసింది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్. మ్యాచును చూడటానికి హాజరయ్యే ప్రేక్షకులందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించింది.
స్టేడియంలో ఉన్నంతసేపు ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని చెప్పింది. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వారిని స్డేడియం లోపలికి అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినా, జాత్యహంకార వ్యాఖ్యలు చేసినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.