ఐపీఎల్, ప్రపంచకప్ టోర్నీలతో దాదాపు మూడు నెలల పాటు క్రికెట్ ప్రియులు పండగ చేసుకున్నారు. మెగాటోర్నీ ముగిసినా అదే ఆసక్తిని కొనసాగించేందుకు ఐసీసీ వినూత్నంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను తీసుకొచ్చింది. సుదీర్ఘ మ్యాచ్‌ల్లో ఈ సరికొత్త నిర్ణయం ఎలాంటి మార్పులు తీసుకొస్తుందన్న ప్రశ్నకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ స్పందించాడు. టెస్టు క్రికెట్ కూడా అభిమానులకు మజాను ఇస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే అందుకు మంచి పిచ్‌లు మరిన్ని తయారుచేయాలని సూచించాడు.
"టెస్టులకు అనుకూలించే పిచ్‌ల్లో మ్యాచ్‌లు ఆడితే ఆట ఆసక్తికరంగా ఉంటుంది. పిచ్‌లు బాగుంటేనే క్రికెట్ బోర్ కొట్టదు. ఉత్కంఠ గొలిపే మలుపులు, మంచి బౌలింగ్ స్పెల్స్, అద్భుతమైన బ్యాటింగ్‌తో వీక్షకులను ఆకట్టుకోవచ్చు. ప్రజలు అప్పుడే ఎక్కువగా టెస్టుపై దృష్టిపెడతారు"
-సచిన్ తెందూల్కర్
యాషెస్ సిరీస్ ఉత్కంఠగా సాగుతూ ఆకట్టుకుంటోందని... గత వారం లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్ మధ్య మంచి పోటీ నెలకొందని తెలిపాడు మాస్టర్.
"దురదృష్టవశాత్తు రెండో టెస్టులో స్మిత్‌కు గాయమై మ్యాచ్‌కు దూరమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లతో అతడికి సవాల్ విసిరి.. మ్యాచ్‌ను థ్రిల్లింగ్‌గా మార్చాడు. స్మిత్ ఔటవ్వకుండా ఉంటే ప్రేక్షకులు మరింత ఆసక్తిగా మ్యాచ్ తిలకించేవాళ్లు"
-సచిన్ తెందూల్కర్