ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విషం చిమ్మిన షాహిద్ అఫ్రిదిపై భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. పాక్ మాజీ ఆటగాడి వ్యాఖ్యల్ని తిప్పికొట్టాడు.
"పాక్‌లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతు ఉందని 16 ఏళ్ల వృద్ధుడు (అఫ్రిది) అన్నాడు. అయినా 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం యాచిస్తూనే ఉంది. పాక్ ప్రజల్ని మోసం చేయడానికి అఫ్రిది, ఇమ్రాన్, బజ్వా వంటి జోకర్లు.. భారతదేశం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్మగలరు. కాని కశ్మీర్‌ను ఎప్పటికీ పొందలేరు. బంగ్లాదేశ్ గుర్తుందా?" అని గంభీర్ గట్టిగా జవాబిచ్చాడు.
స్నేహితుడిగా భావించి తప్పు చేశా..
"ప్రపంచం ఒక ప్రాణాంతక వ్యాధి బారిన పడింది. అయితే అంతకంటే ప్రమాదకరమైనది మోదీ మనసులో ఉంది" అంటూ అంతకుముందు పీఓకేలో అఫ్రిది నోరు పారేసుకున్నాడు. తమ సైన్యానికి కశ్మీర్ ప్రజలు మద్దతిస్తున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అఫ్రిది వ్యాఖ్యలను భారత మాజీ ఆటగాళ్లు యువరాజ్‌సింగ్, హర్భజన్‌సింగ్‌లూ తప్పుపట్టారు. "కరోనా మహమ్మారిపై పోరాడేందుకు వీడియో సందేశం ద్వారా తన స్వచ్ఛంద సంస్థకు మద్దతు ఇవ్వాలని నన్ను, యువీని అఫ్రిది కోరాడు. మళ్లీ మళ్లీ అతడు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అఫ్రిదిని స్నేహితుడని పిలిచినందుకు బాధపడుతున్నా. స్నేహితుడని పిలిపించుకునే అర్హత అతడికి లేదు" అని భజ్జీ అన్నాడు.