తెలంగాణ

telangana

ETV Bharat / sports

అప్పుడు కెప్టెన్​.. ఇప్పుడు అటెండర్​ జాబ్ కోసం ఆరాటం - టీమ్​ఇండియా దివ్యాంగ జట్టు

భారత దివ్యాంగ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దినేశ్​ సైన్​ అటెండర్ జాబ్​ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తన కుటుంబ పరిస్థితి బాగో లేదని అందువల్ల ఈ జాబ్​కు అప్లై చేసినట్లు తెలిపాడు.

అప్పుడు జట్టు కెప్టెన్​.. ఇప్పుడు అటెండర్​ జాబ్ కోసం ఆరాటం
అప్పుడు జట్టు కెప్టెన్​.. ఇప్పుడు అటెండర్​ జాబ్ కోసం ఆరాటం

By

Published : Jul 28, 2020, 10:15 PM IST

Updated : Jul 28, 2020, 10:54 PM IST

భారత్​లో క్రికెట్​కు ఉన్న ఆదరణ మరే దేశంలోనూ ఉండదు. అందువల్లే దేశ క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా విరాజిల్లుతోంది. మన ఆటగాళ్ల జీతాలు మిగిలిన దేశ క్రికెటర్లతో పోలిస్తే చాలా ఎక్కువే. ఈ బ్యాట్, బంతి ఆటకున్న క్రేజ్ ఇండియాలో మరే క్రీడకు లేదు. అందుకే మన క్రికెటర్లు ఫోర్బ్స్ జాబితాల్లో టాప్​లో నిలుస్తున్నారు. అయితే మళ్లీ పురుషుల క్రికెట్​కు ఉన్నంత విలువ మహిళా క్రికెట్​కు లేదనే చెప్పొచ్చు. ఇక బ్యాడ్మింటన్, టెన్నిస్, హాకీల్లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తెచ్చిన వారికి మాత్రమే ఎంతోకొంత గుర్తింపు ఉంటుంది. మరి దివ్యాంగ క్రికెటర్ల పరిస్థితేంటి. వీరి ఆటను ఎవరు చూస్తారు. వీరి జీతాలు ఎంత. ఇప్పుడు మాజీ టీమ్​ఇండియా కెప్టెన్​ దినేశ్ సైన్ పరిస్థితి చూస్తే మీకే అర్థమవతుంది.

పేరు దినేశ్ సైన్. చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఎలాగోలా కష్టపడి భారత జట్టులో స్థానం సంపాదించాడు. 2015-19 కాలంలో టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. జట్టుకు కెప్టెన్ బాధ్యతలూ నిర్వర్తించాడు. కానీ ప్రస్తుతం 35 ఏళ్ల ఈ క్రికెటర్ కుటుంబ పరిస్థితి బాగాలేదు. అందుకే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో అటెండర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

అప్పుడు జట్టు కెప్టెన్​.. ఇప్పుడు అటెండర్​ జాబ్ కోసం ఆరాటం

"నాకు 35 ఏళ్లు. నేను ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. నాకు తెలిసింది క్రికెట్ ఒక్కటే. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించా. కానీ నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు. నాడాలో అటెండర్ పోస్ట్ ఉందని తెలిసి దరఖాస్తు చేశా. ఈ పోస్టు కోసం అందరికీ 25 ఏళ్ల వయసు నిబంధన విధించారు. దివ్యాంగులకు 35 ఏళ్ల వరకు సడలింపు ఉంది. నేను ఈ పోస్టు పొందాలంటే ఇదే నాకు చివరి అవకాశం."

-దినేశ్, టీమ్​ఇండియా మాజీ దివ్యాంగ క్రికెటర్

దినేశ్​కు భార్య, ఏడాది బాబు ఉన్నారు. ప్రస్తుతం ఇతడి కుటుంబానికి అతడి సోదరుడు అండగా నిలుస్తున్నాడు. కానీ వయసు పెరుగుతున్న దృష్ట్యా ఇలా ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ జాబ్ వస్తే కుటుంబం పోషణతో పాటు యువ క్రికెటర్లకు మద్దతుగా నిలిచిన వాడినవుతానని అతడు వెల్లడించాడు. ఇంతకుముందు జిల్లా కోర్టులో అటెండర్ ఉద్యోగానికి కూడా దినేష్ అప్లై చేశాడు.

2015లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఐదు దేశాల సిరీస్​లో దినేశ్ నాలుగు మ్యాచ్​ల్లో 8 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్​గా నిలిచాడు. ఇందులో పాకిస్థాన్​పైనా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అయితే ఈ టోర్నీలో భారత్ విజయం సాధించలేదు. 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఇదే సిరీస్​లో టీమ్​ఇండియా విజేతగా నిలిచింది. కానీ దినేశ్​ను ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. అయినా అధికారుల్ని పట్టుబట్టి ఇంగ్లాండ్ పయనమయ్యాడు. జట్టులో చోటు దక్కకపోయినా యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ప్రతిభ ఉన్నప్పుడు వైకల్యం పెద్ద సమస్య కాదని చెబుతూ ఉండేవాడినని తెలిపాడు దినేశ్.

Last Updated : Jul 28, 2020, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details