మ్యాక్స్‌వెల్.. విని రామన్.. ఈ పేర్లలో చాలా వైరుధ్యం కనిపిస్తుంది. అతడు ఆస్ట్రేలియా క్రికెటర్. ఆమె ఆ దేశంలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. ఈ ఇద్దరూ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా విదేశీ క్రీడాకారులు.. భారతీయ అమ్మాయిల్ని పెళ్లాడటం కొత్తేమీ కాదు. చరిత్రలో ఇలాంటి బంధాలు చాలానే ఉన్నాయి. ఆ బంధాల ముచ్చట్లేంటో చూద్దాం పదండి.
సానియా మీర్జా - షోయబ్ మాలిక్
క్రికెట్, టెన్నిస్ రెండు భిన్నమైన క్రీడలు. కానీ.. ఈ రెండు ఆటలు ఓ జంటను కలిపాయి. హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌తో ప్రేమలో పడింది. వీరి ప్రేమకు పునాది పడింది దుబాయ్‌లో. పెళ్లి తర్వాత ఇద్దరూ ఎక్కువ సమయం గడుపుతున్నది ఆ నగరంలోనే. వీళ్లిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు.
కొత్త జంట
మ్యాక్స్‌వెల్, విని రామన్.. ఆస్ట్రేలియా క్రికెట్లో కొన్నేళ్లుగా వినిపిస్తున్న పేర్లివి. 2017 నుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. తరుచుగా విహార యాత్రలకు వెళ్లే ఈ జంట పెళ్లి చేసుకోవడం ఖాయమని చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ మధ్యే భారతీయ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
మైక్ బ్రియర్లీ- మనా సారాభాయి
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు 1981లో యాషెస్ ట్రోఫీని అందించి దిగ్గజ స్థాయిని అందుకున్న మైక్ బ్రియర్లీ భారత్‌కు చెందిన మనా సారాభాయిని పెళ్లాడాడు. లండన్‌లో స్థిరపడ్డ వీరికి ఇద్దరు సంతానం. 1976-77లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించిన సందర్భంగా మైక్‌కు మనాతో పరిచయమైంది. భారత దిగ్గజ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి కుటుంబానికి చెందిన అమ్మాయే మనా సారాభాయి.
ముత్తయ్య మురళీధరన్- మదిమలర్
శ్రీలంకకు చెందిన దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కుటుంబానికి చెన్నైలో మూలాలున్నాయి. అతను ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆ తమిళ అమ్మాయి పేరు మదిమలర్. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం విశేషం. మురళి, మదిమలర్‌లకు ఇద్దరు పిల్లలున్నారు.
జహీర్ అబ్బాస్- రీటా
పాకిస్థాన్ దిగ్గజ ఓపెనర్ జహీర్ అబ్బాస్ సతీమణి భారత అమ్మాయే. ఆమె పేరు రీటా లూథ్రా. 1980లో వీళ్లిద్దరికీ పరిచయమైంది. జహీర్ బ్రిటన్‌లో ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడుతుండగా.. అక్కడే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేస్తున్న రీటాతో పరిచయమైంది. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 1988లో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత రీటా పేరు సమీనా అబ్బాస్‌గా మారింది.
మోసిన్ ఖాన్- రీనా రాయ్
పాకిస్థాన్ మాజీ ఓపెనర్ మోసిన్ ఖాన్.. క్రికెట్ కెరీర్ వదిలేశాక బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం విశేషం. ఇక్కడ 13 సినిమాల్లో నటించిన మోసిన్.. ఆ సమయంలోనే నటి రీనా రాయ్‌తో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు వీరి బంధం గుట్టుగా సాగింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఓ బిడ్డ పుట్టాక ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.