భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే కంటే ఆ మ్యాచ్‌లో భారత అబ్బాయి-ఆసీస్ అమ్మాయికి చేసిన 'ప్రేమ ప్రపోజల్' చాలా చర్చనీయాంశమైంది. అయితే వారిద్దరూ స్టేడియంలోనే తొలిసారి కలుసుకున్నారా? లేదా అంతకుముందు ఒకరికి ఒకరు పరిచయముందా? అనే అనుమానం చాలామందికి వచ్చింది. సోషల్ మీడియాలోనూ వారి గురించే మాట్లాడుకున్నారు. ఇప్పుడు వీటన్నింటికి ఫుల్స్టాప్ పెడుతూ తమ రిలేషన్ గురించి, తొలిసారి కలుసుకున్న సందర్భం గురించి చెప్పాడు డిపెన్ మండలియా(భారత్ అబ్బాయి).
"2018 అక్టోబరులో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు మారా. కొత్త అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన తర్వాత పోస్ట్ ద్వారా మెయిల్స్ వచ్చాయి. అవి నా కోసం కాదని, అంతకుముందు ఇదే ఇంట్లో ఉన్న వారి కోసం అని అర్థమైంది. ఆ వ్యక్తిని నేరుగా కలిసి సదరు మెయిల్‌ను ఇవ్వాలని అనుకున్నా. ఆ మెయిల్ రోజిలీ వింబుష్(రోజ్) అనే అమ్మాయి కోసం అని తెలిసింది. ఫేస్‌బుక్‌లోని ఓ ప్రైవేట్ గ్రూప్ ద్వారా ఆమెను సంప్రదించి, మెయిల్ ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని చెప్పా. అలా మేం తొలిసారి కలిశాం. అయితే అప్పుడు మాట్లాడటానికి నేను కొంచెం భయపడటం వల్ల కేవలం 10 సెకన్లలో మా సంభాషణ పూర్తయింది. ఆమెకు మెయిల్ ఇచ్చి బాయ్ చెప్పి ఎవరి దారిన వారు వెళ్లిపోయాం."