రోహిత్ శర్మ రాకతో టీమ్ఇండియా మరింత బలంగా మారిందని హిట్‌మ్యాన్ కోచ్ దినేశ్ లాడ్ అభిప్రాయపడ్డారు. భారత జట్టు ఇటీవల ప్రదర్శనను పరిశీలిస్తే.. సిడ్నీలో టీమ్ఇండియానే పైచేయి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్.. తన బ్యాటింగ్ టెక్నిక్‌ను వృద్ధి చేసుకున్నాడని, ఎలాంటి బౌలర్‌నైనా ఎదుర్కొంటాడని వెల్లడించారు. అలాగే తాజాగా ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు రోహిత్ కోచ్ దినేశ్ లాడ్.
ప్ర. మూడో టెస్టులో టీమ్ఇండియాపై మీ అంచనా ఏమిటి?
దినేశ్ లాడ్:తొలిటెస్టులో పరాజయం తర్వాత తిరిగి పుంజుకుని రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో మూడో టెస్టుపై మరింత ఆసక్తి పెరిగింది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌డే టెస్టులో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఇప్పుడు రోహిత్ రాకతో జట్టుకు మరింత బలం చేకూరనుంది. గాయం కారణంగా ఉమేశ్ సిరీస్ నుంచి వైదొలగినా.. సైనీ, శార్దూల్ టీమ్‌కు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.
ప్ర. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులో టీమ్ఇండియా టాప్ఆర్డర్ విఫలమైంది. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్‌లు బ్యాటింగ్‌లో ఇబ్బందిపడుతున్నా.. శుభ్‌మన్ గిల్ క్రమంగా రాణిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ రోహిత్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది?
దినేశ్ లాడ్:నాకు తెలిసి రోహిత్ శర్మ ఓపెనర్‌గా రావొచ్చు. టీమ్ఇండియా యాజమాన్యం అదే విధంగా ఆలోచిస్తుందని భావిస్తున్నా. ఓపెనర్‌గా దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణించాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఆడిన అనేక మ్యాచ్‌ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అందుకే ఓపెనర్‌గా రోహిత్‌ను పంపి.. అతడికి భాగస్వామిగా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయొచ్చు. నాకు తెలిసి మయాంక్ స్థానంలో రోహిత్‌ను జట్టులోకి తీసుకుంటారని ఆశిస్తున్నా.
ప్ర. లెఫ్టార్మ్ బౌలర్లతో రోహిత్ ఆటతీరును గమనిస్తే.. ప్రస్తుత సిరీస్‌లో మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్లను రోహిత్ ఏ విధంగా ఎదుర్కొంటాడు?
దినేశ్ లాడ్:మొదట్లో తాను ఆన్‌సైడ్ ఆడాలనే ఆలోచనతో చాలా ఇబ్బందిగా బ్యాటింగ్ చేసేవాడు. కానీ, ప్రస్తుతం లెఫ్టార్మ్ బౌలింగ్‌లోనూ మామూలుగా ఆడుతున్నాడు. గతంలో లాంటి ఇబ్బందులు ఇప్పుడు రోహిత్‌కు లేవని భావిస్తున్నా.
ప్ర. రోహిత్ శర్మ విదేశాల్లో బ్యాటింగ్ చేయలేక పోతున్నాడని.. అతని కెరీర్లో ఎక్కువ రన్స్ స్వదేశంలోనే చేశాడని విమర్శకులు అంటున్నారు. దానికి మీ సమాధానం?