తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్ సిరీస్​ ​: ఆసీస్​కు స్టోక్స్​ 'మాస్టర్ స్ట్రోక్'​ - ashes

లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ వికెట్ తేడాతో గెలిచింది. బెన్​ స్టోక్స్​ అద్భుత శతకంతో ఒంటరి పోరాటం చేసి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. జోయ్​ రూట్(77), జోయ్ డిన్లై(50) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆసీస్​ బౌలర్లలో హేజిల్​వుడ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

స్టోక్స్​

By

Published : Aug 25, 2019, 9:44 PM IST

Updated : Sep 28, 2019, 6:22 AM IST

యాషెస్ సిరీస్​ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​ విజయంతో ఐదు మ్యాచుల సిరీస్​ను 1-1తో సమం చేసింది ఇంగ్లీష్​ జట్టు. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. బెన్ స్టోక్స్​(131) శతకంతో అదరగొట్టి ఇంగ్లాండ్​ను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ జోయ్ రూట్(77), జోయ్ డిన్లై(50)అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్​వుడ్ 4 వికెట్లతో మెరిశాడు.

ఓవర్​నైట్ స్కోరు 156/3 పరుగులతో నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్​ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రూట్​ను లయాన్ పెవిలియన్ పంపి ఇంగ్లీష్ జట్టును కష్టాల్లో నెట్టాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది బెయిర్​ స్టో- స్టోక్స్ జోడి. వీరిద్దరూ 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ప్రపంచకప్​ ప్రదర్శన పునరావృతం

నిలకడగా ఆడుతున్న బెయిర్​ స్టోను(36) ఔట్ చేసి ఇంగ్లాండ్​ను దెబ్బతీశాడు హేజిల్​వుడ్​​. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ముందుండి నడిపించాడు స్టోక్స్​. ప్రపంచకప్​ ఫైనల్​ ప్రదర్శనను పునరావృతం చేస్తూ అద్భుత శతకంతో ఆదుకున్నాడు. టెయిలెండర్లతో ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు. 286 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన జట్టును విజయ తీరానిలకు చేర్చాడు.

మ్యాచ్ అనంతరం

76 పరుగుల్లో 75 స్టోక్స్​వే...

చివరి వికెట్​ జాక్​ లేతో కలిసి 76 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు స్టోక్స్​. అందులో లే చేసింది ఒక్క పరుగు అంటే స్టోక్స్ పోరాటం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరివరకు క్రీజులో పాతుకుపోయి ఇంగ్లీష్​ జట్టును గెలుపు అంచులకు చేర్చాడు. గెలుపు ఖాయమానుకున్న ఆసీస్​కు పరాభవం తప్పలేదు.

స్టోక్స్ అద్బుత ఇన్నింగ్స్​

ఆలౌట్​ నుంచి అద్భుత విజయం వరకు​..

తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్ 179 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు 67 పరుగులకే ఆలౌటై అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ స్థితి నుంచి కోలుకుని మ్యాచ్ గెలవడం ఏ జట్టుకైనా దాదాపు అసాధ్యమే.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ స్టోక్స్ మ్యాచ్​ను గెలిపించి విమర్శకుల నోళ్లకు చెక్​ పెట్టాడు.

రెండో ఇన్నింగ్స్​లో ఆసీస్ 246 పరుగుల చేయగా.. 112 పరుగుల ఆధిక్యంతో కలిపి ఇంగ్లాండ్​కు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూ బౌలర్లలో హేజిల్​వుడ్ తొలి ఇన్నింగ్స్​లో 5, రెండో ఇన్నింగ్స్​లో 4 వికెట్లతో ఆకట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.

ఇది చదవండి: 'సింధు విజయం భవిష్యత్​ తరాలకు స్ఫూర్తి'

Last Updated : Sep 28, 2019, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details