ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతోన్న తొలిటెస్టు ఫలితం దిశగా సాగుతోంది. మూడోరోజు చివరి సెషన్లోనే బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్.. నాలుగోరోజు విండీస్ పేస్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. ఆధిక్యం పెరుగుతున్న తరుణంలో కరీబియన్ బౌలర్లు విజృంభించారు. చివరి సెషన్లో ఏకంగా ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను నిలువరించారు. ఫలితంగా 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి 170 పరుగుల ఆధిక్యంలో ఉంది ఆతిథ్య జట్టు.
రాణించిన ఆ ముగ్గురు
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో జాక్ క్రావ్లీ(127 బంతుల్లో 76 పరుగులు), డామ్ సిబ్లీ(164 బంతుల్లో 50 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (79 బంతుల్లో 46 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంకా రెండు వికెట్లు మాత్రమే ఉన్న ఇంగ్లాండ్.. చివరి రోజు ఎంత మేరకు నిలబడతారో అనే దానిపైనే ఆ జట్టు విజయం ఆధారపడి ఉంది. అయితే ఆ రెండు వికెట్లను విండీస్ బౌలర్లు ఎంత త్వరగా కట్టడి చేస్తే.. అంత వేగంగా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తుంది కరీబియన్ టీమ్.