కరోనా వైరస్ కారణంగా నాలుగు నెలల పాటు నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ మొదలవుతోంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్-వెస్టిండీస్ తొలి టెస్టు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కరోనా ముప్పు పొంచివుండటం వల్ల, ఈ సిరీస్‌ను బయోబబుల్ సృష్టించి నిర్వహిస్తున్నారు. స్టేడియాల్లోకి వీక్షకులకు ప్రవేశం లేదు. అభిమానుల్లేకుండా మ్యాచ్ జరగడం 143 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
కొన్నాళ్ల క్రితమే బయట ప్రపంచంతో ఆటగాళ్లకు సంబంధాలు తెగిపోయాయి. వైరస్ బారిన పడకుండా వారంతా సురక్షిత వాతావరణంలోనే ఉన్నారు. ముందుస్తు జాగ్రత్తగా బంతిపై ఉమ్ము రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. ఒకవేళ అలవాట్లో పొరపాటుగా రుద్దితే తొలిసారికి అంపైర్లు వదిలేస్తారు. రెండుకన్నా ఎక్కువసార్లు చేస్తే జరిమానాగా ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇస్తారు.