టీమ్ఇండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం రిషభ్ పంత్‌తో పోటీ పడుతున్నాడు యువ క్రికెటర్ సంజు శాంసన్. తాజాగా ఇదే విషయమై స్పందించిన సంజూ.. అతడు తనకు పోటీ అనుకోవడం లేదని, తామిద్దరం కలిసి ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. దీనితో పాటు పలు విషయాలను పంచుకున్నాడు.
"జట్టు ఎంపిక, కాంబినేషన్ బట్టి ఉంటుందని అనుకుంటున్నా. పంత్ నాకు పోటీ అనుకోవడం లేదు. అయితే పోటీ అనేది ఆటలో ఉండాలి, ఇతర క్రికెటర్ల స్థానాన్ని ఆక్రమించే దానిపై కాదు. ఒకవేళ అలా చేస్తే అది ఆటగాళ్ల లక్షణం కాదు. పంత్ నాకు పోటీ అని మీరంతా అనుకుంటున్నారు. కానీ, మేమిద్దరం కలిసి ఆడాలని నేను కోరుకుంటున్నా. మా జోడీ బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తే బాగుంటుంది. ఐపీఎల్లో ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పుడు మేం అదే చేశాం. పంత్‌తో కలిసి ఆడాలని నాకు ఎప్పుడూ ఉంటుంది"
- సంజు సామ్సన్, టీమ్ఇండియా క్రికెటర్
ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌కు ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ప్రత్యామ్నాయంగా సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఇతడికి అవకాశం లభించకపోయినా.. అనూహ్యంగా చివరి రెండింటిలో ఓపెనర్‌గా బరిలో దిగాడు. కానీ ఆ మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే వెనుదిరిగాడు.