మహేంద్ర సింగ్ ధోనీ అంటే ప్రోత్సాహం, సమన్వయం, మిడిలార్డర్ బ్యాట్సమెన్ను ఓపెనర్‌గా ప్రమోట్ చేయడం, టెయిలెండర్లతో అర్ధశతకాలు చేయించి మ్యాచ్‌లు గెలిపించడం. ఇలాంటి ఘనతలన్నీ ఇతడికే సొంతం. అప్పటి వరకూ దారుణంగా పరుగులిచ్చిన బౌలర్లతోనూ చివరి ఓవర్ బౌలింగ్ వేయించి భారత్ ఖాతాలో విజయాలు చేర్చిన చరిత్ర ధోనీదే.
ముందు మూడు.. తర్వాత మిడిలార్డర్
మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ ప్రారంభంలో విశాఖ వన్డేలో చేసిన సెంచరీని గాలివాటం అన్నవాళ్లు చాలామంది. అది తప్పని నిరూపిస్తూ శ్రీలంకపై 183 పరుగులతో చెలరేగాడు. భారత్‌కు ఓ గొప్ప వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దొరికాడన్న ప్రశంసను అందుకున్నాడు. ఈ క్రమంలోనే సారథిగా పగ్గాలు చేపట్టాడు. అవసరాల కోసం మిడిలార్డర్‌లోకి మారాడు. 5,6,7,8వ స్థానాల్లో దిగి, టెయిలెండర్లతో సమర్థంగా నడిపించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు జట్టుకు ఆపద్భాందవుడిగా మారాడు. ఫినిషర్‌గానూ అనూహ్య విజయాలను అందించాడు.
రోహిత్ ఓపెనర్‌గా మారడం ధోనీ చలవే
మిడిలార్డల్ బ్యాట్స్‌మన్ రోహిత్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసి భారత్‌కు విధ్వంసక ఓపెనర్‌ను అందించాడు ధోనీ. శిఖర్ను ప్రోత్సహిస్తూ.. రోహిత్-ధావన్ రూపంలో అన్ని ఫార్మాట్లలో కొన్నేళ్ల పాటు చక్కటి ఓపెనింగ్ జోడీని అందించాడు. ఐపీఎల్లో భాగంగా ఎంతోమంది దేశవాళీ క్రికెటర్లతో పాటు.. అంతర్జాతీయ క్రికెటర్లకు అనేక అవకాశాలు ఇచ్చి వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేశాడు.
ధోనీ సహకారం.. భువీ అద్భుత ఇన్నింగ్స్
2017 ఆగస్టులో శ్రీలంకతో రెండో వన్డేలో 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది భారత్. ఓపెనర్లు తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో బౌలర్ అఖిల ధనుంజయ 6 వికెట్లు తీయడం వల్ల 131 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమ్ఇండియా. ఈ దశలో టెయిలెండర్లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పిన ధోనీ.. అపూర్వ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ధోనీ 45, భువనేశ్వర్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.