టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అభిమానులకు తీవ్ర బాధను మిగిల్చాడు. అతడు తన ఆటతీరుతోనే కాకుండా తన చమత్కారంతోనూ ఆకట్టుకున్నాడు. మీడియాకు పలు సందర్భంగా చురకలంటిస్తుండేవాడు. ఈ సందర్భంగా ధోనీ పేల్చిన కొన్ని మాటల తూటాలను చూద్దాం.
వందశాతం ఫిట్‌గా లేకున్నా.. ఆటలో కొనసాగుతూ ఉంటే మోసం చేస్తున్నట్లే
-2008లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ సందర్భంగా తన ఫిట్‌నెస్ గురించి
కావాలనుకుంటే 1.8 లేదా 1.9పరుగులను 2 పరుగులుగా మార్చవచ్చు. కానీ 1.75, 1.70ను రెండు పరుగులుగా చేయలేం.
-వికెట్ల మధ్య సహచరుల పరుగు గురించి నిర్మోహమాటంగా
మనపై 100కిలోల భారం మోపారు అనుకుందాం. ఆ తర్వాత ఓ పర్వతాన్ని భుజాలపై వేసినా పెద్దగా తేడా అనిపించదు.
-కెప్టెన్సీ ఒత్తిడిపై చమత్కారంగా చెప్పిన మాట
నలుగురు ఫాస్ట్‌బౌలర్లతో ఆడిన ప్రతిసందర్భంలో రెండు విషయాలు జరిగాయి. ఒకటి, కెప్టెన్ నిషేధాన్ని ఎదుర్కోవడం. రెండు, ఓడిపోవడం
-విదేశాల్లో ఓటములపై ప్రశ్నలకు ధోనీ విశ్లేషణ
శ్రీశాంత్‌ను నియంత్రించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీశాంత్ మాత్రమే. నా నియంత్రణలో లేని అంశం ఇది. అందుకోసం ఎక్కువగా ఆలోచించను.
-జట్టు సభ్యుల నియంత్రణలో మిస్టర్ కూల్ వ్యవహార శైలి
సెలెక్టర్లు, కెప్టెన్, కోచ్‌లు మాత్రమే ఉండే సమావేశంలో జరిగే విషయాలు బయటకు వస్తుండటం అసహనం కలిగించేది, అది నిజంగా అమర్యాదకరం