లాక్‌డౌన్ సమయంలో తనను మించిన ఎంటర్‌టైనర్ లేడు ఇకపై రాడు అనేలా విజృంభిస్తున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తూ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ కొద్ది కాలం వ్యవధిలోనే లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఈ విధ్వంసకర ఓపెనర్ తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశాడు. క్రికెట్‌లో తనకు ఏ ఫార్మాట్ అంటే ఇష్టమో.. ఈ టిక్‌టాక్ వీడియో ద్వారా తెలిపాడు.
ఈ వీడియోలో వార్నర్ ఓ అద్దం ముందు సాధారణ దుస్తులతో నిలబడి ఉంటాడు. అకస్మాత్తుగా గారడి చేసినట్లుగా అద్దంలో తన దుస్తులు ఆస్ట్రేలియా టీ20 జెర్సీలోకి మారిపోతాయి. అనంతరం వన్డే జెర్సీ, ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ జెర్సీలోకి మారిపోతుంది. టెస్ట్ క్రికెట్ జెర్సీలోకి మారిపోగానే ఎంతో ఉత్సాహంతో ఎగిరి గంతేశాడు వార్నర్. "టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌ను నేను అమితంగా ఇష్టపడతాను. ఏమంటారు మీరు?" అంటూ వ్యాఖ్య జోడించాడు.