ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పాకిస్థాన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గబ్బా వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టులో 335* పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు సగం మారథాన్ పూర్తి చేశాడు. వికెట్ల మధ్య 20.921 కిలోమీటర్ల దూరానికి పైగా పరుగెత్తాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా హై ఫెర్ఫార్మెన్స్ బృందం వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో 9 గంటలకు పైగా క్రీజులో ఉన్న వార్నర్.. 127 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం విశేషం.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 593 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన పాక్.. 302 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ మూడోరోజు ఆట ముగిసే సమయానికి 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఆసీస్ కంటే 248 పరుగుల వెనుకంజలో ఉంది పాక్ . ఇంకా రెండు రోజులు ఆట ఉండటం వల్ల, పాక్ అసాధారణ రీతిలో చెలరేగితే తప్ప ఓటమి నుంచి బయటపడలేదు.