1989, నవంబర్ 15.. సచిన్ తెందూల్కర్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోజు. 16 ఏళ్ల వయసున్న లిటిల్ మాస్టర్... పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. పిన్న వయసులోనే బ్యాట్ పట్టిన ఈ దిగ్గజం.. ఆ తర్వాత వన్డే, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తనదైన ఆటతీరుతో ఒక్కో మెట్టు ఎదుగుతూ... చివరికి టెస్టులు ఆడిన ప్రతి దేశంపై సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
మూగబోయిన మైదానం...
నవంబర్ 15వ తేదీన సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించగా.. 2013, నవంబర్ 16న తన టెస్టు క్రికెట్‌కు ముగింపు పలికాడు. వెస్టిండీస్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చివరిగా తెలుపు జెర్సీలో కనిపించాడు మాస్టర్. ఈ మ్యాచ్ నవంబర్ 14న ప్రారంభమై.. నవంబర్16న మూడు రోజుల్లోనే ఫలితం తేలిపోయింది. 126 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. చివరి టెస్టులో 74 పరుగులు చేశాడు సచిన్. ఆ మ్యాచ్ అనంతరం అభిమానులు, ఆటగాళ్ల అభివాదం, కరతాల ధ్వనుల మధ్య సుదీర్ఘ ఆటకు వీడ్కోలు పలికాడు మాస్టర్ బ్లాస్టర్.