ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్.. మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం అనుమానంగా కనిపిస్తోంది. భవిష్యత్ సారథిగా స్మిత్ మాత్రమే కాకుండా మరికొందరు యువ ఆటగాళ్ల పేర్లను పరిశీలిస్తున్నామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ అన్నారు. తమ దగ్గర సమర్థవంతమైన వాళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు.
"ప్రస్తుతం మెగ్, ఫించ్, టిమ్ పైన్ రూపంలో అద్భుతమైన కెప్టెన్లు ఉన్నారు. ఉత్సాహవంతమైన యువ సారథులు వెలుగులోకి వస్తున్నారు. కాబట్టి స్మిత్‌ను తీసుకోవాలా వద్దా అనేది ఆలోచించే కన్నా అత్యుత్తమం ఎవరనే దానిపైనే దృష్టిసారించాలి. స్మిత్ గొప్ప ఆటగాడు. అతడు కెప్టెన్‌గా బాధ్యతలు చక్కగా నిర్వర్తించాడు. భవిష్యత్తు సారథిగా ఎవరిని నియమించాలనే విషయమై ప్రస్తుతం మేం చర్చించట్లేదు. ఒకవేళ కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అందుకోసం ఏమి చేయాలో మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి"