కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆటలు నిలిచిపోయాయి. కీడా సంఘాలు, లీగులు, జట్లు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. మహమ్మారి కారణంగా బీసీసీఐకి కూడా ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయక తప్పలేదు. 2020 ఐపీఎల్ జరగడం అనుమానంగానే ఉంది. ఒకవేళ టోర్నీ రద్దయితే బీసీసీఐ, ఫ్రాంఛైజీలకు రూ.5వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.
సౌకర్యం ఉన్నా..
బీసీసీఐతో పాటు అనేక ఐపీఎల్ జట్లకు కూడా కరోనా మహమ్మారికి వర్తించే బీమా లేదని హోడెన్ అనే ప్రైవేటు సంస్థ తన నివేదికలో పేర్కొంది. బీసీసీఐ సంప్రదించే సమయానికే ఇన్సూరెన్స్ కంపెనీ తమ కవరేజీ క్లాజ్ నుంచి కరోనా మహమ్మారిని తొలగించిందని చెప్పింది. బీసీసీఐతో పాటు అనేక ఫ్రాంఛైజీలకు బీమా సౌకర్యం ఉంది. ఆ ఫ్రాంఛైజీలు కూడా ఫిబ్రవరి-మార్చి నాటికి గానీ తమ బీమా కంపెనీలను సంప్రదించడం మొదలు పెట్టలేదు. అప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది. దాంతో మహమ్మారి కారణంగా టోర్నమెంట్ రద్దయితే ఇన్సూరెన్స్ కింద డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా బీమా కంపెనీలు నిబంధనలు మార్చాయి.