భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యే చారిత్రక డే/నైట్ టెస్టు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ సందర్భంగా బంగ్లా ఆటగాళ్లు ఒకడుగు ముందుకేసి పింక్ బాల్‌ను నీళ్లలో ముంచి మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. డే/నైట్ టెస్టుపై మంచు ప్రభావం ఉన్నందున ఆ పరిస్థితులకు అలవాటు పడేలా ప్రాక్టీస్ చేస్తున్నామని బంగ్లా స్పిన్నర్ మెహిది హసన్ తెలిపాడు.
సోమవారం బంగ్లా ఆటగాళ్లు సుమారు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. ప్రధాన కోచ్ రసెల్ డొమింగో ఆధ్వర్యంలో క్యాచ్‌లు పట్టడంలో శిక్షణ పొందారు. ఈ మూడు రోజులూ తమ పేస్ బౌలర్లు బంతిని తడిగా చేసి ప్రాక్టీస్ చేస్తారని, ఈ విధంగా పింక్ బాల్ టెస్టుకు అలవాటు పడతామని హసన్ వివరించాడు. బంతి తడిగా మారితే.. అది జారుతుందని, అయినా స్పిన్నర్లకు బౌన్స్, టర్న్ లభిస్తుందని తెలిపాడు.