ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ సమరానికి ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా సన్నద్ధమౌతున్నాయి. తాజాగా 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఆసీస్. ప్రపంచకప్‌లో సత్తాచాటిన స్మిత్, వార్నర్‌తో పాటు కేమరూన్ బాన్‌క్రాఫ్ట్‌కు అవకాశం కల్పించింది కాంగారూ బోర్డు.
యాషెస్ సిరీస్‌కు ఎంపికైన కంగారూ జట్టు..
టిమ్‌పైన్(కెప్టెన్, కీపర్), కేమరూన్ బాన్‌క్రాఫ్ట్, కమిన్స్, మార్కస్ హ్యారీస్, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లేబస్చేన్, నేథన్ లైయాన్, మిషెల్ మార్ష్, మిషెల్ నెసెర్, జేమ్స్ ప్యాటిన్సన్, పీటర్ సిడిల్, స్టీవ్ స్మిత్, మిషెల్ స్టార్క్, మ్యాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్.
టెస్టు సిరీస్‌కు వార్నర్, స్మిత్..
బాల్ టాంపరింగ్ వివాదంతో 12నెలలు సస్పెన్షన్‌కు గురైన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఈ ప్రపంచకప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో పునారగమనం చేశారు. ఇద్దరూ జట్టుకు తోడవడం వల్ల సెమీస్ వరకు చేరింది ఆసీస్. ముఖ్యంగా వార్నర్ 10 మ్యాచుల్లో 647 పరుగులతో రీ ఎంట్రీలో ఘనంగా సత్తా చాటాడు.
ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆకట్టుకున్న బాన్‌క్రాఫ్ట్ యాషెస్‌కు ఎంపికయ్యాడు. ఇటీవల సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఆసీస్ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి చోటు జట్టులో దక్కించుకున్నాడు.
"ఇటీవల ప్రదర్శన ఆధారంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ను టెస్టు జట్టులోకి తీసుకుంటున్నాం. స్మిత్, వార్నర్ వల్ల జట్టుకు అదనపు సహకారం అందనుంది. కేమరూన్ కౌంటీల్లో అద్భుతంగా ఆడాడు" - ట్రెవర్ హార్న్స్, ఆసీస్ జట్టు సెలక్టర్
ఇంగ్లాండ్ వేదికగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్16 వరకు ఐదు టెస్టులు ఆడనుంది ఆసీస్. ఇంగ్లీష్ గడ్డపై 2001 నుంచి ఒక్కసారి కూడా యాషెస్ సిరీస్ గెలవలేదు కంగారూ జట్టు.
ఇది చదవండి: భారత్‌తో వన్డే సిరీస్‌లో గేల్‌కు అవకాశం