తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిక్సర్​ కొడితే ఆటగాళ్లే బంతి తెచ్చుకోవాలి!

కరోనా దెబ్బకు పలు క్రికెట్​ టోర్నీలు రద్దవుతుండగా.. మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌x ఆస్ట్రేలియా వన్డే సిరీస్​ను మాత్రం అభిమానులు లేకుండా నిర్వహిస్తున్నారు. ఈ తరహాలో జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్​ మ్యాచ్​ ఇదే కావడం విశేషం. అయితే నేడు జరిగిన ఈ మ్యాచ్​లో పలు ఆసక్తికర విషయాలు నమోదయ్యాయి.

Kiwis pacer Lockie Ferguson, Australia bowler Ashton Agar searched for ball in an empty stand at the SCG
సిక్సర్​ కొడితే ఆటగాళ్లే బంతి తెచ్చుకోవాలి!

By

Published : Mar 13, 2020, 5:35 PM IST

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డేలో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. కరోనా ప్రభావంతో క్రీడాకారులు ప్రత్యర్థులతో కరచాలనం చేయోద్దని ఆయా బోర్డులు ఆటగాళ్లకు సూచించాయి. ఇప్పటికే ఈ విషయంలో ఇంగ్లాండ్‌ అన్ని జట్లకన్నా ముందుంది. ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనానికి బదులు ఫిస్ట్‌బంప్స్‌ చేయాలని నిర్ణయించుకుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఇతర ఆటగాళ్లూ కరచాలనం చేయడానికి భయపడుతున్నారు. ఈరోజు ఆస్ట్రేలియా X న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి వన్డేలో ఆయా జట్ల సారథులు అలవాటులో పొరపాటు చేశారు. టాస్‌ వేసేటప్పుడు ఆరోన్‌ ఫించ్‌, కేన్‌ విలియమ్సన్‌ ఎప్పటిలాగే కరచాలనం చేసుకొని తర్వాత నవ్వుకున్నారు. ఆపై మోచేతులను తాకించుకొని వెళ్లిపోయారు.

ఇరుజట్ల సారథులు కేన్​ విలియమ్సన్​, ఆరోన్​ ఫించ్​

ఆటగాళ్లే బంతి తెచ్చుకోవాలి ..!

ఈ వన్డే సిరీస్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రేక్షకులను అనమతించకుండా నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్టాండ్ల మధ్యే ఇరు జట్లూ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఫించ్​ కొట్టిన భారీ సిక్స్‌ స్టాండ్స్‌లోకి దూసుకుపోయింది. అక్కడ బంతిని అందివ్వడానికి ఎవ్వరూ లేకపోవడం వల్ల ఫీల్డర్‌ ఫెర్గుసన్​ ఖాళీ స్టాండ్స్‌లోకి వెళ్లి బంతిని వెతికి మైదానంలోకి విసిరాడు. న్యూజిలాండ్​ బ్యాటింగ్​లోనూ జేమ్స్​ నీషమ్​ సిక్సర్​ కొట్టగా.. ఆసీస్​ బౌలర్​ ఆస్టన్​ అగర్ స్టాండ్స్​లో బంతిని వెతికి తెచ్చుకున్నాడు.​ ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్​గా మారాయి.

ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్​ వార్నర్​ (67), ఫించ్ ​(60), లబుషేన్ ​(56) అర్ధశతకాలతో రాణించగా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఛేదనలో 41 ఓవర్లలో 187 రన్స్​కు ఆలౌటైంది న్యూజిలాండ్​ జట్టు. గప్తిల్​(40), లాథమ్​(38) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఫలితంగా ఆసీస్​ 71 పరుగుల తేడాతో గెలిచింది. కరోనా సెగ తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్​ అభిమానులు లేకుండా జరగడమే కాకుండా ఫలితమూ తేలింది. మ్యాచ్​ ముగిసిన తర్వాత ఆటగాళ్లు చప్పట్లు కొట్టుకుంటూ అభినందించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details