ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ నెగ్గి 18 ఏళ్లయింది. రికీ పాంటింగ్, క్లార్క్ లాంటి దిగ్గజ సారథుల వల్ల కానీ ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో నిలిచిన కంగారూ జట్టు చివరిదైన ఐదో టెస్టును డ్రా చేసుకున్నా.. సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. లండన్‌లోని ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య యాషెస్ ఐదో టెస్టు జరగనుంది.
సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే చివరి టెస్టులో ఇంగ్లాండ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 671 పరుగులతో సిరీస్ టాప్ స్కోరర్‌గా ఉన్న ఆసీస్ తురుపు ముక్క స్టీవ్ స్మిత్‌ను కట్టడి చేయాలి. ఇంగ్లాండ్‌లో బెన్ స్టోక్స్, రోరీ బర్న్స్ మినహా మిగతా ఆటగాళ్లు రాణించట్లేదు. వారు పుంజుకోవాలి. ఈ సిరీస్‌లో 354 పరుగులతో ఇంగ్లీష్ జట్టు తరపున టాప్ స్కోరు చేసింది స్టోక్సే. కెప్టెన్ రూట్ ఫామ్‌లోకి రావాల్సి ఉంది.
అండర్సన్ గైర్హాజరుతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. కొత్త బంతితో స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. స్మిత్ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అతడు క్రీజులో ఉన్న ప్రతి నిమిషం గెలుపుపై ఇంగ్లాండ్‌కు ఆశలు సన్నగిల్లుతున్నాయి.
నాలుగో టెస్టులో గాయం కారణంగా బెన్ స్టోక్స్ బౌలింగ్ చేయలేదు. ఐదో టెస్టులో అతడు బ్యాటింగ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. ఇప్పటికే సామ్ కరన్, క్రిస్ వోక్స్.. ఇద్దరికి చివరి టెస్టుకు అవకాశం కల్పించింది ఇంగ్లాండ్.