యాషెస్ సిరీస్ రెండో టెస్టును వర్షం వెంటాడుతూనే ఉంది. తొలి రోజు ఆటను ముంచేసిన వాన.. రెండో రోజు తెరపినిచ్చింది.. మళ్లీ మూడో రోజు 24.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓవర్‌నైట్ స్కోరు 30/1తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా80 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టీవ్ స్మిత్(13), మ్యాథ్యూ వేడ్(0) క్రీజులో ఉన్నారు.
11 పరుగుల వ్యవధిలో పటాపటా..
60/1తో మెరుగైన స్థితిలో ఉన్న ఆసీస్ 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. బాన్‌క్రాఫ్ట్‌తో(13) మొదలైన వికెట్ల పతనం ట్రేవిస్ హెడ్(7) వరకు కొనసాగింది. ఇంగ్లాండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆర్చర్ తన తొలి అంతర్జాతీయ టెస్టు వికెట్‌ను తీశాడు.
స్మిత్ ఇంకా ఉన్నాడు..
క్రీజులో స్టీవ్ స్మిత్, మ్యాథ్యూ వేడ్ క్రీజులో ఉండడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. తొలి టెస్టులోనూ వీరిద్దరూ శతకాలతో విజృంభించి కంగారూ జట్టుకు విజయ్యాన్ని అందించారు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ స్మిత్ సెంచరీలు చేసి మ్యాచ్ మలుపుతిప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో మెరిసిన వేడ్ జట్టుకు భారీ ఆధిక్యాన్నివ్వడంలో కీలకపాత్ర పోషించాడు.
వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దవగా.. రెండో రోజు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కంగారూ జట్టు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఫలితంగా ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌటైంది. రోరీ బర్న్స్(53), బెయిర్ స్టో(52) అర్ధశతకాలు మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలర్లు కమిన్స్, హాజిల్‌వుడ్, లైయన్ చెరో 3 వికెట్లు తీశారు.
ఇది చదవండి: 'కోహ్లీ వ్యాఖ్యలు కోచ్ ఎంపికను ప్రభావితం చేయలేదు'