ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి టెస్టు గెలిచి జోరు మీదున్న ఆసీస్‌ను రెండు, మూడు టెస్టుల్లో కట్టడి చేసింది ఇంగ్లీష్ జట్టు. 1-1తో సమం చేసి సిరీస్ ఆశలు సజీవం చేసుకుంది. నేడు నాలుగో టెస్టు జరగనుంది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్ నిలిచేనా...
ప్రపంచ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ మెగాటోర్నీ తర్వాత ఆడుతున్న ప్రతిష్ఠాత్మక సిరీస్ యాషెస్. మధ్యలో ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు ఆడినప్పుటికీ అసలు సిసలు సమరం యాషెస్ సిరీసే. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో నెగ్గి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను ఘనంగా ఆరంభించాలనుకుంటుంది. అయితే ఆసీస్ ఆటగాడు స్మిత్ దెబ్బకు తొలి టెస్టులో పరాజయం చెందిన ఇంగ్లీష్ జట్టు తర్వాత జోరు పెంచింది. రెండో టెస్టును డ్రా చేసుకుని.. మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌లో టాపార్డర్ విఫలమవుతోంది. ప్రపంచకప్‌లో రాణించిన జేసన్ రాయ్ యాషెస్ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో జేసన్ చేసింది 67 పరుగులే. నెంబర్ 4లో ఆడుతున్న జోయ్ డిన్లైను జేసన్ స్థానంలో బ్యాటింగ్‌కు పంపితే ఇంగ్లాండ్ పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది.బౌలింగ్‌లో స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి మేటి బౌలర్లు ఇంగ్లాండ్ సొంతం. బ్రాడ్ 25.35 సగటుతో 14 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
స్టోక్స్ మాస్టర్ స్ట్రోక్..
మూడో టెస్టులో దాదాపు ఓటమి అంచులవరకు వెళ్లిన ఇంగ్లాండ్‌ను తన వీరోచిత పోరాటంతో ఆదుకున్నాడు బెన్ స్టోక్స్. 135 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ప్రపంచకప్ మాదిరిగానే యాషెస్‌లోనూ అసాధారణ పోరాట పటిమను చూపిస్తున్నాడు.