చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగలబోతుందా? పరిస్థితులు చూస్తుంటే తప్పదేమో అనిపిస్తోంది. సీఎస్కే ఇప్పటికే సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సేవలు కోల్పోయింది. ఇప్పుడు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను కూడా ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తన తల్లి అనారోగ్యం కారణంగా భజ్జీ ఇంకా ఆతిథ్య దేశానికి వెళ్లలేదు. సెప్టెంబర్ 1 నాటికే యూఏఈకి చేరుకోవాల్సి ఉందని జట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ ఇప్పటికీ అందుబాటులో లేడని.. అసలు టోర్నీలో ఆడతాడా? ఒకవేళ ఆడితే దుబాయ్‌కు ఎప్పుడు వస్తాడు? వీటిపై ఫ్రాంచైజీకి కూడా భజ్జీ అధికారికంగా ఎటువంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని వెల్లడించాయి. దీంతో అతడు ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమవ్వనున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.