వెస్టిండీస్‌పై టీట్వంటీ సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న టీమిండియా.. మరో రసవత్తర సమరానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. తొలి పోరు గయానా వేదికగా గురువారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా టాప్-3 సిద్ధమవుతోంది. విరాట్, రోహిత్, శిఖర్ బ్యాటు ఝళిపించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రపంచకప్‌లో ధావన్ స్థానంలో ఓపెనర్‌గా అదరగొట్టిన రాహుల్.. విండీస్‌తో సిరీస్ కోసం నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఐదో స్థానంలో జాదవ్, ఆరులో పంత్ బ్యాటింగ్‌కు రానున్నారు. ఇందులో ఏమైనా మార్పులు చేస్తే శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే ఆడే అవకాశం ఉంది.
మనీశ్, అయ్యర్లలో ఎవరికి ఛాన్స్..?
ఇటీవలే జరిగిన టీట్వంటీ సిరీస్‌లో మనీశ్ అనుకున్నంత మేర రాణించలేకపోయాడు. కాబట్టి ఒకవేళ అయ్యర్‌కు అవకాశం రావొచ్చు.బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చి షమికి పేస్ బాధ్యతలు అప్పగించొచ్చు. అదే విధంగా టీట్వంటీల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన నవదీప్ సైనీ.. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం లాంఛనమే.
ప్రపంచకప్ అత్యధిక పరుగులు చేసిన వారిలో తొలి స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ.. ఈ సిరీస్‌లోనూ అదే ఫామ్ కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ ఫార్మాట్లో కోహ్లీ ఇప్పటికే తానెంటో నిరూపించాడు కాబట్టి ఆలోచించాల్సిన పనిలేదు. కానీ మిడిలార్డర్ ఎలా ఆడుతుందన్నదే ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.