ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తుందంటేనే చాలు.. క్రికెట్ అభిమానుల దృష్టంతా అటు వైపే ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో నమోదయ్యే రికార్డులపై ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. అయితే ఎన్ని ఘనతలు నమోదైనప్పటికీ క్రిస్ గేల్ అత్యధిక స్కోరు 175 పరుగుల రికార్డును మాత్రం అధిగమించడం మాత్రం చాలా కష్టం. ఎంతో మంది ఆటగాళ్లు ప్రయత్నించినప్పటికీ ఇంతవరకు ఎవరూ సాధించలేకపోయారు. తాజాగా ఈ అంశంపై క్రిస్ గేల్ స్పందించాడు. తన రికార్డును బ్రేక్ చేయడం ఓ భారత క్రికెటర్ వల్లే అవుతుందని స్పష్టం చేశాడు. ఇంతకీ గేల్ చెప్పిన భారత ఆటగాడు కోహ్లీనో, రోహిత్ శర్మనో అనుకుంటే పొరపాటే. తన రికార్డును లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని తెలిపాడు.
"నాకు తెలిసి నా రికార్డును అధిగమించేది కేఎల్ రాహుల్ అనే అనుకుంటున్నాను. తనదైన రోజున అతడు ఏదైనా సాధించగలడు. అతడు తన సామర్థ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాడని నేను అనుకోవట్లేదు. కానీ నా మాట వినండి.. కేఎల్ రాహుల్‌ను దగ్గరనుండి చూశాను. అతడు తలచుకుంటే కొన్నిసార్లు కాకపోయినా, ఇంకొన్ని సార్లయినా కచ్చితంగా అద్భుతం చేస్తాడు" అని క్రిస్ గేల్ అన్నాడు.