Champions Trophy 2025 Hosting Rights : 2025లో జరిగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులకు సంబంధించిన అగ్రీమెంట్ తమతో చేసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు- పీసీబీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీని కోరింది. ఒక వేళ భద్రత, రాజకీయ కారణాలు చెప్పి పాకిస్థాన్‌లో పర్యటించడానికి భారత్ నిరాకరిస్తే.. అందుకు తమకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీసీబీలో ఉన్న విశ్వనీయ వర్గాల సమాచారం. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్‌గా పాకిస్థాన్‌ను ఐసీసీ గుర్తించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్‌గా పాకిస్థాన్‌ను ఐసీసీ గుర్తించినప్పటికీ.. దానికి సంబంధించిన అగ్రీమెంట్‌పై సంతకం చేయలేదని తెలుస్తోంది.
'2025లో ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించడంపై చర్చించేందుకు అహ్మదాబాద్‌లోని ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుతో పీసీబీ ఛైర్మన్ జకా అష్రఫ్, సిఓఓ సల్మాన్ నసీర్ సమావేశమయ్యారు బీసీసీఐ తమ జట్టును పాకిస్థాన్‌కు పంపడానికి మళ్లీ నిరాకరించే అవకాశాలపై పాకిస్థాన్ అధికారులు చర్చించారు. దీంతోపాటు ఏ పరిస్థితిలోనైనా ఐసీసీ.. టోర్నమెంట్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని పీసీబీ స్పష్టం చేసింది. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే.. స్వతంత్ర భద్రతా ఏజెన్సీని నియమించాలని పీసీబీ అధికారులు ఐసీసీకి తెలిపారు. దీంతోపాటు భారత్ సహా టోర్నీలో పాల్గొనే జట్ల భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం, భద్రతా అధికారులతో ఏజెన్సీ అనుసంధానం చేయగలదని చెప్పారు. గత రెండేళ్లలో ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు లేకుండానే అనేక అగ్రశ్రేణి జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాయని వారు ఐసీసీకి తెలియజేశారు' అని విశ్వనీయ వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్, భారత ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా.. భద్రత, రాజకీయ కారణాల వల్ల పాక్‌లో ఆడకుండా భారత్ మళ్లీ వెనక్కి తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని పీసీబీ అధికారులు స్పష్టంగా చెప్పారని తెలుస్తోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చే హక్కులను పాక్ వదులుకోబోదని నసీర్ ఐసీసీ సమావేశంలో స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే పాక్‌లో టీమ్ఇండియా పర్యటనపై భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.