Pant Accident Bus Driver: టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఓ బస్సు డ్రైవర్ ప్రమాదం నుంచి రక్షించాడు. శుక్రవారం ఉదయం రూర్కీ సమీపంలో పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ బస్సును సుశీల్ మాన్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఈ ప్రమాదాన్ని చూసిన మొదటి వ్యక్తి సుశీల్. ప్రమాదం చూసిన వెంటనే బస్సులో నుంచి దిగి కారులో చిక్కుకున్న పంత్‌ను బయటకు తీశాడు. అప్పటికే కారుకు మంటలు అంటుకున్నాయని సుశీల్ తెలిపాడు. కాగా పంత్ తీవ్రంగా గాయపడి నడిచేందుకు కూడా ఇబ్బంది పడినట్లు సుశీల్ మాన్ చెప్పాడు.
ఆ సమయంలో తాను హరిద్వార్ వైపు నుంచి వస్తున్నానని.. పంత్ కారు దిల్లీ వైపు ఉత్తరాఖండ్‌కు వస్తోందని సుశీల్ తెలిపాడు. కాగా పంత్ కారు డివైడర్‌ను ఢీకొని దాదాపు 200 మీటర్ల దూరంలో పడింది, దీంతో వెంటనే నా బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రమాదం జరిగిన కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాను.అయితే ముందుగా కారు బోల్తాపడిందనుకున్నాను. పంత్ అప్పటికే కారు అద్దంలో నుంచి సగం బయటకు వచ్చి తాను క్రికెటర్‌నని చెప్పి తన తల్లికి ఫోన్ చెయమని కోరాడు. తాను క్రికెట్ చూడనని అందుకని గుర్తుపట్టలేకపోయానని సుశీల్ తెలిపాడు. అయితే తన బస్సులో వచ్చిన ప్రయాణికులు కొందరు పంత్‌ను గుర్తుపట్టి కారులో నుంచి బయటకు లాగారు. కారులో ఇంకెవరైనా ఉన్నారేమో అని చూశాము. వెంటనే అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చి దేహ్రాదూన్ అసుపత్రికి పంపించాము అని డ్రైవర్ చెప్పాడు. పంత్ కారులో నీలి రంగు బ్యాగులో రూ.7000 క్యాష్ కూడా ఉందని వాటిని అంబులెన్స్‌లో అతడికే అప్పగించామని సుశీల్ మాన్ తెలిపాడు.