ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్తు అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడని టీమ్‌ఇండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై బీసీసీఐ సమగ్ర దర్యాప్తు చేయనుందని తెలుస్తోంది. అలాగే శ్రీలంక టెస్టు సిరీస్ జట్టులో ఎంపిక కాకపోవడంపై సాహా చేసిన వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
"సాహా ఇంటర్వ్యూలో ఏమన్నాడు. వాట్సాప్ చాట్‌లో ఏముంది. అది ఎవరు పంపారు? అనే విషయాలను పూర్తి స్థాయిలో బీసీసీఐ దర్యాప్తు చేయనుంది. సాహా వాట్సాప్‌లో చేసిన వ్యాఖ్యలు ఓ జర్నలిస్టువే అని రుజువైతే ఇండియన్ క్రికెటర్లను ఇంటర్వ్యూ చేయకుండా అతన్ని రద్దు చేసే అవకాశం ఉంది." అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.
జర్నలిస్టుపై సాహా అసహనం..
ఓ జర్నలిస్టుపై సాహా అసహనం వ్యక్తం చేశాడు. ఆ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం తనను బలవంతం చేసినట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ మెసేజీల స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. అయితే, తాను స్పందించకపోయేసరికి ఆ వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేశాడని సాహా పేర్కొన్నాడు. 'భారత క్రికెట్ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్టు నుంచి ఎదురైన అనుభవం ఇది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది' అని సాహా విచారం వ్యక్తం చేశాడు.