గంగూలీ కొత్త ప్లాన్.. క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ
20:50 October 15
గంగూలీ కొత్త ప్లాన్.. క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న సౌరభ్ గంగూలీ.. బంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందు క్యాబ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన.. మరోసారి ఆ ఎన్నికలకు పోటీ పడనున్నారు.
మూడేళ్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు నిబంధనలు అంగీకరించని నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి గంగూలీ దిగిపోవడం ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే తర్వాతి ఇన్నింగ్స్ గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఈ మేరకు సమాధానం ఇచ్చారు దాదా. 'అవును, క్యాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. అక్టోబర్ 22న నామినేషన్ వేస్తా. లోథా కమిటీ నిబంధనల ప్రకారం ఐదేళ్లు క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్నా. ఇంకో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉంది. అక్టోబర్ 20న నా ప్యానెల్ వివరాలను ఖరారు చేస్తా. చూద్దాం' అని గంగూలీ పేర్కొన్నారు.
2015 నుంచి 2019 వరకు గంగూలీ.. బంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించారు. అనంతరం బీసీసీఐలోకి అడుగుపెట్టారు. కాగా, గంగూలీ అన్నయ్య స్నేహశిష్.. క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే, స్వయంగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఈ వార్తలకు చెక్ పడింది. గంగూలీ రాకతో అనేక పరిణామాలు మారిపోయే అవకాశం ఉంది.
TAGGED:
ganguly cab president