అండర్-19 ప్రపంచకప్ గెలిచి భారత్ మహిళ క్రికెట్ స్థాయిని మరో మెట్టు పెంచారు మన అమ్మాయిలు. దీంతో వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వీరు అందుకున్న విజయ కిరీటాన్ని చూసి భారతదేశం అంతా గర్వపడుతోంది. దీంతో విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. "భారత్‌లో మహిళల క్రికెట్ ఊపుమీదుంది. ఈ ప్రపంచకప్ విజయం అమ్మాయిల క్రికెట్ స్థాయిని మరింత పైకి తీసుకెళ్లింది. విజేతగా నిలిచిన జట్టుకు, సహాయక సిబ్బందికి కలిపి రూ.5 కోట్లు నగదు బహుమతిగా ప్రకటించడం ఆనందంగా ఉంది. 'బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్‌కు ఈ అమ్మాయిల జట్టును ఆహ్వానిస్తున్నా. ఈ ఘనతకు తగిన సంబరాలు చేసుకోవాల్సిందే" అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు.
అండర్19 ప్రపంచ కప్‌లో మన అమ్మాయిలు చూపించిన ప్రదర్శనకు అందరు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే భారత కెప్టెన్ షఫాలీ వర్మ కూడా వీరిపై ప్రశంసల జల్లు కురిపించారు. 'ప్రపంచకప్‌లో అమ్మాయిల ఆట తీరు ఎంతో బాగుంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో బాగా ఆడారు. వారి ఆటతీరు గురుంచి ఎంత చెప్పినా తక్కువే. కీలక పాత్ర పోషించిన సహాయక బృందానికి కృతజ్ఞతలు అని" తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప విజయం ఒక్కరిది కాదని, సమష్టి కృషి ఉందని తెలిపారు. ఫిబ్రవరిలో సీనియర్ మహిళల టీ20 ప్రపంచకప్‌ని కూడా గెలవాలని ఉందని షఫాలీ తెలిపారు.
అండర్19 టీ20 గెలుపు దశలు
- దక్షిణాఫ్రికా(లీగ్ దశలో): 7 వికెట్లతో గెలుపు
- యూఏఈ: 122 పరుగులతో
- స్కాట్లాండ్: 83 పరుగుల తేడాతో గెలుపు
- సూపర్ సిక్స్: 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఓటమి
- శ్రీలంక: 7 వికెట్లు తీసి విజయం
- సెమీస్: న్యూజిలాండ్‌పై 8 వికెట్లతో
- ఫైనల్స్: ఇంగ్లాండ్‌పై 7 వికెట్లతో గెలుపు