Asian Games 2023: ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు జావో ఝిదాన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇతర దేశాల ప్రతినిధులతోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అథ్లెట్ల కవాతులో భారత క్రీడాకారుల బృందానికి.. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ నేతృత్వం వహించారు. ఈ వేడుకల్లో భారత ప్లేయర్లంతా.. ఖాకీ రంగు గల సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. భారత మహిళలు ఖాకీరంగు చీర, పురుషులు ఖాకీరంగు కుర్తాలో వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ దుస్తులను రూపొందించింది.
ఈ పోటీల్లో ఆయా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్న తెలుగు అథ్లెట్లు..
- బ్యాడ్మింటన్ - కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు,పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి, సాత్విక్ సాయిరాజ్
- బాక్సింగ్ - నిఖత్ జరీన్
- ఆర్చరీ - వెన్నం జ్యోతి సురేఖ
- క్రికెట్ - తిలక్ వర్మ, బారెడ్డి అనూష
- చెస్ - పెంటేల హరికృష్ణ,హారిక ద్రోణవల్లి, కోనేరు హంపి
- టేబుల్ టెన్నిస్- ఆకుల శ్రీజ.