తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​నకు ఇంకొక్కరోజే.. కొత్త రూల్స్​ ఈ కప్​ నుంచే! - ఆసియా కప్​ 2022 లైవ్ అప్డేట్స్​

వెస్టిండీస్‌.. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలిగే పవర్‌ హిట్టర్లు.. బంతితో, బ్యాట్‌తో సత్తాచాటే ఆల్‌రౌండర్లతో నిండిన జట్టు. అదిరే ప్రదర్శనతో రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ గెలిచింది. ఇక శ్రీలంక.. ఒకసారి కప్పు గెలవడమే కాక రికార్డు స్థాయిలో మూడుసార్లు ఫైనల్‌ చేరిన జట్టు. కానీ ఇదంతా గతం. ఇప్పుడీ జట్లు నేరుగా పొట్టి ప్రపంచకప్‌ సూపర్‌-12లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఆదివారం ఆరంభమయ్యే తొలి రౌండ్లో బరిలోకి దిగనున్నాయి.

Asia cup Srilanka vs West indies
టీ20 ప్రపంచకప్​కు ఇంకొక్కరోజే

By

Published : Oct 15, 2022, 7:00 AM IST

Updated : Oct 15, 2022, 8:40 AM IST

ఆస్ట్రేలియా వేదికగా ఎనిమిదో టీ20 ప్రపంచకప్‌కు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ముందుగా సూపర్‌-12కు అర్హత సాధించడం కోసం ఎనిమిది జట్లు పోటీపడతాయి. అందులో వెస్టిండీస్‌, శ్రీలంక ఉండడం గమనార్హం.అర్హత రౌండ్లో శ్రీలంక.. నమీబియా, నెదర్లాండ్స్‌, యూఏఈతో కలిసి గ్రూప్‌-ఎ లో ఉంది. ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే గ్రూప్‌- బి లో ఉన్నాయి. ఒక్కో గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-12కు అర్హత సాధిస్తాయి.

ఒకే ఒక జట్టు..:టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఒకే ఒక జట్టు వెస్టిండీస్‌. బెదురు లేని ఆటతో.. హిట్టింగ్‌కే కొత్త అర్థాన్ని చెబుతూ ఆ జట్టు సత్తాచాటింది. కానీ గత కొన్నేళ్లుగా కీలక ఆటగాళ్లు దూరమవడం, ప్రదర్శన పడిపోవడంతో ఈసారి అర్హత రౌండ్లో చిన్న జట్లతో తలపడాల్సి వస్తోంది. తమ తొలి మ్యాచ్‌లో సోమవారం పూరన్‌ సారథ్యంలోని విండీస్‌.. స్కాట్లాండ్‌తో పోటీపడుతుంది. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో జింబాబ్వే (19న), ఐర్లాండ్‌ (21న)ను ఢీకొంటుంది. గతేడాది ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన ఆ జట్టు ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. 2012, 2016 విండీస్‌ ప్రపంచకప్‌ విజయాల్లో భాగమైన జాన్సన్‌ ఛార్లెస్‌ తిరిగి జట్టులోకి రావడం విశేషం. పూరన్‌, కింగ్‌, హోల్డర్‌, అకీల్‌, పావెల్‌, అల్జారి జోసెఫ్‌ ఆ జట్టుకు కీలకం కానున్నారు. గేల్‌, డ్వేన్‌ బ్రావో లేకుండా తొలిసారి ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌ ఆడనుంది. ఈ సారి పొలార్డ్‌, రసెల్‌, నరైన్‌ కూడా లేరు. ఈ గ్రూప్‌లో విండీస్‌కు గట్టి పోటీ తప్పకపోవచ్చు. తొలిసారిగా నిరుడు సూపర్‌-12కు అర్హత సాధించిన స్కాట్లాండ్‌ ఈ సారి కూడా తమ ముద్ర వేసేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి ప్రపంచ టీ20 క్వాలిఫయింగ్‌ టోర్నీలో అగ్రస్థానంతో 2016 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వేను తక్కువ అంచనా వేయలేం. ఇటీవల ఆస్ట్రేలియాకు ఆ జట్టు షాకిచ్చింది. మరోవైపు టీమ్‌ఇండియాతో సిరీస్‌లో పోరాడిన ఐర్లాండ్‌ ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌పై 3-2తో గెలిచింది.

వరుసగా రెండోసారి..: ఈ టోర్నీ చరిత్రలో మూడు సార్లు ఫైనల్‌ చేరిన ఏకైక జట్టుగా కొనసాగుతున్న శ్రీలంక మరోసారి అర్హత రౌండ్‌ ఆడాల్సి వస్తోంది. 2014లో ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు నిరుడు కూడా తొలి రౌండ్లో తలపడింది. అందులో ఉత్తమ ప్రదర్శనతో సూపర్‌-12కు అర్హత సాధించింది. ఈసారి కూడా అదే ప్రదర్శన పునరావృతం చేయాలనే ధ్యేయంతో ఉంది. ఇటీవల బలమైన భారత్‌, పాకిస్థాన్‌ను వెనక్కినెట్టి మరీ టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన లంక సమరోత్సాహంతో సై అంటోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో కుర్రాళ్లు గొప్పగా రాణిస్తున్నారు. శనక కెప్టెన్సీలోని ఆ జట్టు హసరంగ, అసలంక, చమీరా, కరుణరత్నె, నిశాంక, రాజపక్స, తీక్షణ లాంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో నమీబియాతో తలపడుతున్న శ్రీలంక.. ఆ తర్వాత యూఏఈ (18న), నెదర్లాండ్స్‌ (20న)తో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌-ఎ లో అగ్రస్థానంతో ఆ జట్టు సూపర్‌-12 చేరడం నల్లేరు మీద నడకే. అనంతరం అసలైన పోరులో సత్తాచాటితే కప్పు వరకూ చేరుకునే అవకాశాలున్నాయి.

ఈ కప్పులోనూ కొత్త నిబంధనలు:అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను తొలిసారి ప్రపంచకప్‌లో చూడబోతున్నాం. ఈ నెల 1 నుంచి ఈ నిబంధనలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. నిర్ణీత సమయం లోగా ఫీల్డింగ్‌ జట్టు తమ నిర్దేశిత ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోతే మిగిలిన ఓవర్లకు గాను అదనంగా ఓ ఫీల్డర్‌ వలయం లోపలికి వస్తాడు. బ్యాటర్ల ఏకాగత్ర లోపించేలా బౌలర్‌ రనప్‌ చేస్తున్నప్పుడు ఫీల్డర్లు అంతరాయం కలిగించినా, అనవసరంగా కదిలినా బ్యాటింగ్‌ జట్టుకు అంపైర్లు 5 పరుగులు అదనంగా ఇవ్వొచ్చు.

ఇదీ చూడండి:భారత క్రికెట్​ బోర్డుకు రూ.995 కోట్లు నష్టం.. ఇదే కారణం!

Last Updated : Oct 15, 2022, 8:40 AM IST

ABOUT THE AUTHOR

...view details