తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ashes 2023 : దీటుగా ఆసీస్‌.. ఖవాజా శతకం .. రెండో రోజు మ్యాచ్​ సాగింది ఇలా! ​

Eng vs Aus Test : యాషెస్​ టెస్ట్​ సిరీస్​లో భాగంగా జరిగిన తొలి రోజు మ్యాచ్​లో మెరుపు ఇన్నింగ్స్​ ఆడిన ఆతిథ్య ఇంగ్లాండ్​ జట్టు.. ప్రత్యర్థి ఆసిస్​ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అప్పటికే ఐదు వికెట్లు కోల్పోయిన కంగారులు క్లిష్టమైన పరిస్థితిలోనూ బ్యాట్​ ఝళిపించి మెరుగైన స్కోర్​ చేశారు. కఠిన పరిస్థితుల్లో సత్తా చాటిన ఉస్మాన్‌ ఖవాజా.. అజేయ శతకంతో ఆస్ట్రేలియాను పోటీలో నిలిపాడు. ఖవాజాకు మద్దతుగా హెడ్‌, కేరీ అర్ధసెంచరీలు సాధించడం వల్ల మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఇంతకీ రెండవ రోజు మ్యాచ్​ ఎలా ఉందంటే ?

england vs australia ashes s
ashes 2023

By

Published : Jun 18, 2023, 6:44 AM IST

Eng Vs Aus Ashes : యాషెస్‌ తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టు తన దూకుడును ప్రదర్శిస్తే.. ఆస్ట్రేలియా మాత్రం సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తోంది. ఆరంభంలో వికెట్లు పడిపోయినా.. ఉస్మాన్‌ ఖవాజా సెంచరీతో ఆదుకోవడం వల్ల ఆ జట్టు రెండో రోజు ఆట చివరికి 311/5తో కాస్త జోరందుకుని మెరుగైన స్థితికి చేరుకుంది. ఖవాజాకు తోడుగా అలెక్స్‌ కేరీ క్రీజులో ఉన్నాడు. హెడ్‌ కూడా రాణించాడు.

ఓవర్‌నైట్‌ స్కోరు 14/0తో రెండో రోజు, తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ టీమ్​ను ఇంగ్లాండ్‌ పేసర్లు పరీక్షించారు. వర్షం కురిసి ఆరిన పిచ్‌పై బౌన్స్‌, స్వింగ్​లను రాబట్టి ప్రత్యర్థులకు చెమటలు పట్టించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా బ్రాడ్‌ ప్రభావవంతంగా బంతులేశాడు. ఎక్కువ ఆఫ్‌స్టంప్‌ లోగిలిలో బౌల్‌ చేసిన అతడు.. వార్నర్‌, ఖవాజాలకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు భిన్నంగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మొదట్లో చాలా నెమ్మదిగా సాగింది. ఇక విసిగిపోయిన వార్నర్‌.. బ్రాడ్‌ ఓవర్లో ఓ చెత్త షాట్‌తో వికెట్‌ పారేసుకున్నాడు. తర్వాతి బంతికే లబుషేన్​ను ఔట్‌ చేసిన ఈ పేసర్‌.. ఆసీస్‌ను దెబ్బతీశాడు.

Ashes 2023 : భారత్‌తో ఆడిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీతో అదరగొట్టిన స్టీవ్‌ స్మిత్‌ ఎక్కువసేపే క్రీజులో ఉన్నప్పటికీ అంత సౌకర్యంగా ఆడలేకపోయాడు. మూడు స్లిప్స్‌తో పాటు లెగ్‌ గల్లీలో ఇద్దరు ఫీల్డర్లను పెట్టిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌.. స్మిత్‌పై ఒత్తిడి పెంచాడు. దీంతో బౌండరీలు రాబట్టలేకపోయిన అతడు.. చివరికి స్టోక్స్‌ బౌలింగ్‌లో ఔటై పెవిలియన్​ బాట పట్టాడు. 67/3తో కంగారూ జట్టు కష్టాల్లో పడిన సమయమది. కానీ ఈ స్థితిలో ఫామ్‌లో ఉన్న ట్రావిస్‌ హెడ్‌.. ఖవాజాకు జత కలవడం వల్ల పరిస్థితి క్షణాల్లో మారిపోయింది. ఆసీస్‌ నెమ్మదిగా గేర్లు మార్చి పరుగుల బాట పట్టింది.

అయితే మొదట హెడ్‌.. ఆ తర్వాత గ్రీన్​లను స్పిన్నర్‌ మొయిన్‌ అలీ ఔట్‌ చేసి ఆసీస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. దీంతో ఆ జట్టు స్కోర్​ 220/5తో నిలిచింది. కానీ ఖవాజా తన జోరు తగ్గించలేదు. కేరీ సాయంతో జట్టు స్కోరు 300 దాటించిన అతడు.. ఈ క్రమంలో టెస్ట్​లో తన సెంచరీని అందుకున్నాడు. ఈ మైలురాయి దాటిన కొద్దిసేపటికే బ్రాడ్‌ బౌలింగ్‌లో ఖవాజా బౌల్డ్‌ అయినా.. అది నోబాల్‌ కావడం వల్ల ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు స్థిరంగా బ్యాటింగ్‌ చేసి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కేరీతో పాటు ఖవాజా ఆట చివరి వరకు అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం చేతిలో 5 వికెట్లు ఉన్న ఆ జట్టు ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 393/8 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details