భారత అండర్-19, టీమ్-ఏ జట్లు రాణించడంలో కీలకపాత్ర పోషించాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid). అయితే ఆ జట్లకు కోచ్గా ఉన్నప్పుడు జట్టులో ఉండే ప్రతి ఆటగాడికి ఆడే అవకాశాన్ని ఇచ్చేవాడిని అని చెప్పాడు. సిరీసుకు ఎంపికై ఒక్క మ్యాచైనా ఆడకుంటే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసన్నాడు. చిన్నప్పుడు తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు.
"నేను ముందుగానే వారికి చెబుతున్నా. నాతో పాటు పర్యటనకు వచ్చిన వాళ్లకు ఆడే అవకాశం ఇస్తానని! చిన్నతనంలో నాకు ఓ అనుభవం ఉంది. ఏ జట్టులో ఉన్నప్పుడు ఓ పర్యటనకు వెళ్లాను. అప్పుడు నాకు ఆడే అవకాశం రాలేదు. అది భయకరమైన పరిస్థితి. నాలా ఎవరికి అలాంటి చేదు అనుభవం ఎదురుకాకూడదని జట్టులో ఉన్న ప్రతి ఆటగాడికి ఆడే అవకాశం కల్పిస్తా. ఓ టోర్నీలో మీరు 700-800 పరుగులు చేశారు. భారత్-ఏకు ఎంపికయ్యారు. కానీ నిరూపించుకోవడానికి మీకు అవకాశం రాలేదు. అప్పుడు సెలక్టర్ల దృష్టిలో మీరు వెనకబడతారు. తర్వాతి సీజన్లోనైనా 800 పరుగులు చేద్దామని భావిస్తారు. కానీ అదంత సులభం కాదు. అవకాశం కచ్చితంగా దొరుకుతుందన్న ఛాన్స్ లేదు. అందుకే నేను 11 మంది కాకుండా అత్యుత్తమ 15 మంది ఆడతారని చెబుతా. అండర్-19లో వీలైతే ప్రతి మ్యాచ్‌కు ఐదారు మార్పులు సాధ్యమే".
- రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్