BCCI Chief Selector: టీ20 వరల్డ్‌కప్ 2022తోపాటు అంతకుముందు జరిగిన పలు మెగా టోర్నీల్లో టీమ్ఇండియా వైఫల్యం చెందడంతో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఛైర్మన్‌గా చేతన్ శర్మ ఉండగా, హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్), సునీల్ జోషీ (సౌత్ జోన్), దేబశిష్ మొహంతి (ఈస్ట్ జోన్) సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీ కాలం మరికొంత కాలం ఉన్నా.. బీసీసీఐ కమిటీని రద్దు చేసి, కొత్త సెలెక్షన్ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించింది.
ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీసీసీఐ ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.