Abdul Razzaq Aishwarya Rai :2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆడిన 9 మ్యాచుల్లో 5 మ్యాచులు ఓడిన పాకిస్థాన్.. క్రికెట్ టీమ్ లీగ్ స్టేజ్‌లోనే పోరు నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఆ దేశ మాజీ క్రికెటర్లు. ఈ క్రమంలోనే పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ కూడా స్పందించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఉద్దేశం సరిగ్గా లేదని.. ఆటగాళ్లు గెలవాలనే పట్టుదల ప్రదర్శించలేదని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ పేరును మధ్యలో ప్రస్తావించాడు. ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో ప్రస్తుతం రజాక్ నెట్టింట్ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.
ఇంతకీ ఏమన్నాడంటే?
'పీసీబీ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నేను ప్లేయర్‌గా ఉన్న సమయంలో అప్పటి జట్టు సారథి యూనిస్ ఖాన్ టీమ్‌ను ముందుకు తీసుకువెళ్లిన తీరు అద్భుతంగా ఉండేది. ఆయన నుంచే కాకుండా నా తోటి ఆటగాళ్ల నుంచీ కూడా ఎప్పుడూ స్ఫూర్తి పొందేవాడిని. ఈ కారణంతోనే పాక్ క్రికెట్ కోసం ఎంతోకొంత చేయగలిగాను. అయితే ప్రస్తుతం జట్టు, అందులో ఉన్న ఆటగాళ్లపై బయట అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. 2023 మెగా టోర్నీలో ఘోరమైన ప్రదర్శన తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయి' అని విలేఖరులతో జరిగిన ఓ సమావేశంలో అబ్దుల్ రజాక్ వ్యాఖ్యానించాడు.
'ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన..!'
Abdul Razzaq Comments On Aishwarya Rai : మరోవైపు అంశంతో సంబంధం లేకుండా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరును చర్చలోకి తీసుకువచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు రజాక్.. జట్టు పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రదర్శిస్తున్న తీరును తప్పుపడుతూ అసలు వారి సంకల్పమే బలంగా లేదన్నాడు. పాకిస్థాన్‌లో క్రికెటర్ల సామర్థ్యానికి పదును పెట్టాలన్న ఉద్దేశమే వారికి లేదంటూ విమర్శించాడు. అలాంటప్పుడు మంచి ఫలితాలు ఎలా ఆశించగలమని అన్నాడు. ఆ వెంటనే 'నేను ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుట్టరు కదా. ముందు సంకల్పం దృఢంగా ఉండాలి' అని సంబంధం లేని విషయాన్ని క్రికెట్ బోర్డుతో పోల్చుతూ ముడి పెట్టాడు రజాక్.