తన తల్లిదండ్రులిద్దరూ మాజీ వాలీబాల్ ప్లేయర్లు కావడం వల్ల అదే ఆట ఎందుకు ఆడట్లేదని చిన్నతనంలో తనను చాలా మంది అడిగేవాళ్లని బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు వెల్లడించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఓ వెబినార్‌లో సింధు మాట్లాడుతూ పలు విషయాలు పంచుకుంది.
అలా బ్యాడ్మింటన్ ఎంచుకున్న పీవీ సింధు - కెరీర్ గురించి మాట్లాడిన పీవీ సింధు
గెలుపోటములు పక్కనపెట్టి ఆటను ఆస్వాదించడం చాలా ముఖ్యమని తెలిపింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. తన తల్లిదండ్రులిద్దరూ మాజీ వాలీబాల్ ప్లేయర్లు కావడం వల్ల అదే ఆటను ఎందుకు ఎంచుకోలేదని చాలామంది అడిగినట్లు వెల్లడించింది.
"ఎనిమిదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడడం ఆరంభించా. మొదట్లో సరదా కోసమే ఆడేదాన్ని. ఒలింపిక్స్‌లో పతకం గెలుస్తానని కానీ ప్రపంచ ఛాంపియన్ అవుతానని కానీ అప్పుడు అనుకోలేదు. నా ఆట చూసి మా అమ్మానాన్న ప్రోత్సహించారు. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే ఆడేదాణ్ని. ఆట కోసం చదువును ఎప్పుడూ పక్కన పెట్టలేదు. 'మీ అమ్మా నాన్న వాలీబాల్ క్రీడాకారులు కదా మరి నువ్వు ఎందుకు ఆ ఆట ఎంచుకోలేదు' అని చిన్నప్పుడు చాలా మంది నన్ను అడిగేవాళ్లు. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టమని చెప్పేదాన్ని. మొదట్లో మా ఇంటి దగ్గర ఉన్న కోర్టులోనే ఆడేదాన్ని. అలా రెండేళ్ల తర్వాత గోపీచంద్ అకాడమీలో చేరా. గోపీ సర్ నాకెప్పుడూ మద్దతుగానే నిలుస్తున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగా. గెలుపోటములను పక్కనపెట్టి ఆటను ఆస్వాదించడం చాలా ముఖ్యం" అని సింధు తెలిపింది.
ఇది చూడండి : ఏఐసీఎఫ్లో లుకలుకలు.. చెస్ ఒలింపియాడ్‌కు రెండు జట్లు