Kidambi Srikanth Pressmeet: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ అన్నాడు. ఈ పోటీల్లో తొలిసారి ఫైనల్స్ చేరిన అతడు ప్రత్యర్థి కీన్ యూ(సింగపూర్) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే, శ్రీకాంత్ ఓటమిపాలైనా భారత్ తరఫున ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌కు చేరుకున్న అతడు మీడియాతో ముచ్చటించాడు.
'పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా.. రాబోయే 10 నెలలు కీలకం'
Kidambi Srikanth Pressmeet: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్. ఈ టోర్నీలో పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఇతడు.. హైదరాబాద్ చేరుకున్నాక మీడియాతో ముచ్చటించాడు.
"వచ్చే ఏడాది నాకింకా ముఖ్యమైంది. ఈ విజయాన్ని ఆస్వాదించడానికి కూడా సమయం లేదు. జనవరి 10 నుంచి ఇండియా ఓపెన్, మార్చిలో ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ ఉంది. తర్వాత కామన్‌వెల్త్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నీ, ఆసియా క్రీడలు ఇలా బిజీ షెడ్యూల్ ఉంది. నేను సరైన సమయంలోనే ఫామ్‌లోకి వచ్చాను. గత సెప్టెంబర్ నుంచి మెల్లగా రాణిస్తూ ఇప్పుడు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సంపాదించడం ఆనందంగా ఉంది. ఇకపై నా ప్రదర్శన ఇలాగే కొనసాగించాలనుకుంటున్నా. అయితే.. నా ఆటలో సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఇంకా ఉన్నాయి. కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి వాటిపై దృష్టిసారిస్తా" అని అన్నాడు.
ఇప్పుడు తాను ఎలాంటి గాయాలతో ఇబ్బంది పడటం లేదన్నాడు. ఇదివరకు ఆ సమస్య ఉండేదని, ఇప్పుడు దాన్ని అధిగమించి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానన్నాడు. ఇక ఫైనల్స్‌లో ఆడేటప్పుడు ఒత్తిడి గురించి స్పందిస్తూ.. అలాంటి మేజర్ టోర్నీల్లో ఆడేటప్పుడు కచ్చితంగా ఒత్తిడి ఉంటుందన్నాడు. అయినా, తాను మొదటి గేమ్‌లో బాగా ఆడినట్లు శ్రీకాంత్ గుర్తుచేసుకున్నాడు. అందులో గెలిచే అవకాశం ఉన్నా తన తప్పిదాలతోనే ఓటమిపాలయ్యానని చెప్పాడు. వాటిని అదుపుచేసుకోలేకపోయానని తెలిపాడు. మొత్తంగా తన ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నాన్నాడు. అలాగే సెమీస్‌లో లక్ష్యసేన్‌తో ఆడటంపై మాట్లాడిన శ్రీకాంత్.. కొన్నేళ్లుగా అతడితో ఆడలేదని చెప్పాడు. అయితే, అతడి ఆటతీరును గమనిస్తూ వచ్చానన్నాడు. ఆ మ్యాచ్‌లో ఇద్దరూ హోరాహోరీగా ఆడామని తెలిపాడు.