అప్పుల బాధతో టీవీ నటి మద్దెల సబీరా అలియాస్ రేఖ (42) ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. రేఖ నటి, గాయనిగా స్ధిరపడాలని గతంలో హైదరాబాద్ వెళ్లారు. రెండు టీవీ సీరియల్స్‌లో నటించారు. అవకాశాలు రాకపోవడం వల్ల గుంటూరు వచ్చి అహమ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. మనస్ఫర్థలతో విడిపోయారు. వారికి కుమార్తె ఉంది. అనంతరం రేఖ కాజ వాసి చైతన్యను వివాహం చేసుకున్నారు. వేడుకలు, కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ, పాటలు పాడుతూ జీవనం సాగించారు.
తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య - tv actress suicide news
పలు సీరియల్స్‌లో నటించి, ప్రస్తుతం జీవనం సాగిస్తున్న నటి రేఖ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ప్రస్తుతం ఈమె విద్యానగర్‌లోని నాలుగో లేనులో ఉంటున్నారు. గత రెండేళ్లుగా పాటలు పాడటం మానేశారు. భర్త చైతన్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నష్టాల పాలై, అప్పులు పెరిగిపోవడం వల్ల కుంగిపోయారు. బుధవారం స్నానాల గదికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య ఎంతసేపటికీ బయటకు రాకపోవడం వల్ల చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టాభిపురం ఎస్సై హనుమంతురావు అక్కడికి చేరుకొని స్నానాల గది తలుపులు పగులగొట్టి చూడగా రేఖ ఉరి పోసుకుని వేలాడుతూ కనిపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.