ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘రావోయి చందమామ’ సీరియల్ నటి హారిక సాధు ప్రత్యేక ఇంటర్వ్యూ...
మాది అనంతపురం. అమ్మానాన్న.. హర్‌నాథ్, నాగమణి. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. నాకో తమ్ముడు.. డిగ్రీ చదువుతున్నాడు. అనంతపురం ఇంటెల్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ చేశా. చిన్నప్పటి నుంచే నేను చాలా చురుకు. చదువు, సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా అన్నింట్లోనూ యాక్టివ్. స్కూల్‌లో బోలెడు బహుమతులొచ్చేవి. కాలేజీలో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా నేనుండాల్సిందే. నాన్న క్లాసికల్ డ్యాన్సర్. ఆయనకి నటన అంటే చాలా ఇష్టం. కుటుంబ సమస్యల వల్ల ఈ రంగంలోకి రాలేకపోయారు. దాంతో నా ఇష్టాన్ని ప్రోత్సహించారు. వెయ్యికి పైగా టిక్‌టాక్, డబ్‌స్మాష్ వీడియోలను చేశా. వాటిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాల ద్వారా పంచుకుంటూ ఉంటా.
ఆ వీడియోల ద్వారానే నాకు గుర్తింపు వచ్చింది. మొదట జెమినిలో ‘కల్యాణి’ సీరియల్‌లో అవకాశం లభించింది. అందులో అంధురాలిగా నటించా. ఈ పాత్ర ద్వారా ఎంతో మందికి పరిచితురాలినయ్యా. లాక్‌డౌన్ వల్ల ఆ సీరియల్ ఆగిపోయింది. తర్వాత తమిళంలో ‘తిరుమగళ్’లో అంజలిగా చేస్తున్నా. తమిళ రచయిత శ్యామ్ ద్వారా తెలుసుకుని, నిర్మాతలు ‘కల్యాణి’లో నా నటన చూసి అవకాశం ఇచ్చారు.
నటి కాకపోతే... ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. నటనలో ఓనమాలన్నీ ఇక్కడే నేర్చుకున్నా. నటిని కాకపోతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగినో, ఎయిర్ హోస్టెస్‌నో అయ్యేదాన్ని.
కొత్త భాష...తిరుమగళ్‌లో అవకాశానికి ఆనందపడినా.. భాష తెలియదని భయపడ్డా. అమ్మే నా వెన్ను తట్టింది. దాంతో ధైర్యంగా ముందడుగు వేశా. భాష రాకపోయినా మొదటి ఎపిసోడ్ బాగా చేశావంటూ దర్శకుడు మెచ్చుకున్నారు. అప్పుడు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి. ఎలాగైనా తమిళం నేర్చుకోవాలనుకున్నా. ట్రాన్స్‌లేటర్‌ను పెట్టుకుని, ప్రతి పదమూ తెలుసుకునే దాన్ని. ఇప్పుడు తమిళంలో గలగలా మాట్లాడేస్తా.
కష్టాలు... ‘రావోయి చందమామ’లో ఓ సన్నివేశంలో చెప్పులు లేకుండా రాళ్లలో పరుగెత్తాలి. అదీ రాత్రి పూట షూటింగ్. అప్పుడు పాదాలకు బాగా దెబ్బలు తగిలాయి. బురదలో పడిపోయా. అయినా అలానే చేశా. ఇవన్నీ పెద్ద కష్టాలు కాదు. నచ్చిన రంగంలో ఉన్నానన్నదే సంతోషం. కాకపోతే.. అమ్మానాన్నలకు దూరంగా ఉంటున్నాననేది కాస్త బాధ. హీరోల్లో విజయ్ దేవరకొండ, రానా... హీరోయిన్లలో మాధురీ దీక్షిత్, సౌందర్య, రమ్యకృష్ణ.. ఇప్పటివారిలో కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ బాగా వింటా. కుక్క పిల్లలతో ఆడుకోవడం మరీ ఇష్టం.
లాక్‌డౌన్‌లో వంట.. ‘కల్యాణి’ చేసేటప్పుడు సన్నగా ఉండే దాన్ని. కాస్త లావుగా ఉంటే బాగుంటుందని అందరూ చెప్పడంతో లాక్‌డౌన్‌లో ఇష్టమైనవి తిన్నా. మంచి శరీరాకృతి కోసం వర్కవుట్స్‌కి ఎక్కువ సమయం కేటాయించా. అమ్మచేసే కొబ్బరిచట్నీ, గులాబ్‌జామ్‌లంటే లొట్టలేస్తా. తినడమే కాదు.. ఈ ఖాళీలో అమ్మ దగ్గర వంట నేర్చుకున్నా. వెజ్ బిర్యానీ బ్రహ్మాండంగా చేస్తా.
ఇదీ చదవండి:పెళ్లింట విషాదం.. కారు ప్రమాదంలో నవవధువు, ఆమె తండ్రి మృతి