'ఆలీతో సరదాగా' లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. అలనాటి దర్శకుడు రేలంగి నరసింహారావు పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు. 'రాధమ్మ' షూటింగ్ సమయంలో దిగ్గజ హాస్యనటుడు రేలంగి వెంకటరామయ్య, తనకు మధ్య జరిగిన నవ్వు తెప్పించే సంఘటన గురించి చెప్పారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్‌తో తాను 32 సినిమాలు తీసినట్లు నరసింహారావు చెప్పారు. తమది భార్యభర్తల సంబంధం లాంటిదని అన్నారు(నవ్వుతూ). నటుడు సుమన్‌ను 'ఇద్దరు కిలాడీలు' చిత్రంతో తామే పరిచయం చేశామని చెప్పారు.
6వ తరగతిలో కోడి రామకృష్ణతో గొడవ జరిగిందని, మళ్లీ డైరెక్టర్ అయిన తర్వాత తామిద్దరం కలిసిపోయినట్లు నరసింహారావు తెలిపారు. చెన్నైలో ఉన్నప్పుడు మీరు విజిల్ వేస్తే రౌడీలు వచ్చేవారా? అని అలీ అడగ్గా, అవునని సమాధానమిచ్చారు.
అలానే ఓ సినిమా షూటింగ్ సందర్భంగా క్లాప్ బోర్డు కిందపెట్టినందుకు గురువు దాసరి నారాయణరావు తనను కొట్టినట్లు నరసింహారావు చెప్పారు. ఆయనను కాకా పట్టేవాళ్లను ముందుపెట్టుకుంటున్నారని, దాసరి కాళ్లకు నమస్కారం చేసి, వెళ్లొస్తానని చెప్పి ఆయన దగ్గర పనిమానేసినట్లు నరసింహారావు ఆనాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు.