తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్యాక్స్ ఫ్రీ.. ఉద్యోగులకు లీవ్.. టాప్​ రేటింగ్స్​.. 'కశ్మీర్​ ఫైల్స్' ఎందుకింత స్పెషల్?

The Kashmir Files: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం విడుదలైన ఈ బాలీవుడ్​ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు పన్ను మినహాయింపు కూడా ఇచ్చాయి. మధ్యప్రదేశ్​లో అయితే ప్రభుత్వమే ఈ సినిమా చూసేందుకు పోలీసులకు సెలవు ఇస్తోంది. ఈ సినిమా ఎందుకంత ప్రత్యేకం?

The Kashmir Files
ది కశ్మీర్ ఫైల్స్​

By

Published : Mar 14, 2022, 4:36 PM IST

The Kashmir Files News: ఎలాంటి అంచనాల్లేకుండా మార్చి 11న విడుదలైన 'ది కశ్మీర్​ ఫైల్స్'​ చిత్రం బాలీవుడ్​లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. స్టార్​ హీరోలు లేకపోయినా బలమైన కథతో తెరక్కెకిన ఈ చిత్రానికి ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు సాధారణంగా ఉన్న ఈ సినిమా కలెక్షన్లు, రెండో రోజు రెండు రెట్లు, మూడో రోజు మూడు రెట్లు పెరిగాయంటే ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాక ఈ చిత్రానికి క్రిటిక్స్​ కూడా అదిరిపోయే రేటింగ్స్​ ఇస్తుండగా.. థియేటర్ల ముందు హౌస్​ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 90వ దశకంలో జమ్ముకశ్మీర్​లో కశ్మీర్​ పండిట్లపై జరిగిన హింసాకాండ ఇతివృత్తంలో రూపొందించిన ఈ చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు.

మోదీని కలిసిన చిత్రబృందం

కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రతిఒక్కరు చూడాల్సిన అవసరం ఉందని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇస్తున్నాయి. ముఖ్యంగా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది.

పోలీసులకు సెలవులు..

మధ్యప్రదేశ్​లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం శివరాజ్​సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. కశ్మీర్ పండిట్​లు 1990లో అనుభవించిన హృదయ విదారక బాధలు, కష్టాలు, దయనీయ పరిస్థితికి ఈ సినిమా అద్దం పడుతోందని, అందుకే ట్యాక్స్ మినహాయిస్తే ఎక్కువ మంది చూసేందుకు అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

అంతేగాక ఈ సినిమా చూసేందుకు రాష్ట్ర పోలీసులకు సెలవు కూడా ఇస్తామని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇప్పటికే డీజీపీకి ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశామని సోమవారం వెల్లడించారు.

The kashmir files tax

గోవా సీఎం చర్యలు..

ఈ చిత్రానికి గోవాలో సాధ్యమైనన్ని ఎక్కువ స్క్రీన్లు కేటాయించేలా చూస్తున్నామని స్వయంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్​ తెలిపారు. ఆయన కూడా సోమవారం ఈ సినిమాను చూశారు. అనంతరం చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.

కశ్మీర్​ పండిట్​లు అనుభవించిన బాధ గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి చరిత్ర పునరావృతం కాకుండా చూసేందుకు ఇది దోహదపడుతుందని సావంత్ ఆదివారం ట్విట్టర్​లో పేర్కొన్నారు. అందుకే వీలైనన్ని ఎక్కువ షోలు ప్రదర్శించాలని ఐనాక్స్​ యాజమాన్యంతో మాట్లాడినట్లు వెల్లడించారు.

దక్షిణ గోవా జిల్లాలోని ఓ మల్టీపెక్స్ చైన్​.. ది కశ్మీర్​ ఫైల్స్ చిత్రాన్ని తక్కువ షోలు ప్రదర్శించేలా కుట్ర చేస్తోందని కొంతమంది ఆందోళనకారులు ఆరోపించారు. థియేటర్లో సీట్లు ఖాళీగా ఉన్నా.. ఆన్​లైన్​లో బుకింగ్​ ఫుల్​ అయినట్లు చూపారని తెలిపారు.

The kashmir files tax free

మహారాష్ట్రలో భాజపా డిమాండ్​..

ఈ చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం వినోద పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యే మంగళ్​ ప్రభాత్ లోధ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చాయని చెప్పారు. మహారాష్ట్ర శాసనమండలిలోనూ భాజపా ఎంఎల్​సీ ప్రవీన్​ దట్కే ఇదే విషయాన్ని లేవనెత్తారు. కొన్ని లౌకిక శక్తులు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూడకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

బిహార్​లో..

'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి బిహార్​లో కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యే సంజయ్​ సరావ్​గీ అసెంబ్లీలో డిమాండ్ చేశారు.

కర్ణాటకలో

కర్ణాటకలోనూ ఈ చిత్రానికి ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. 1980, 1990లలో జరిగిన నిజానిజాలను ఈ చిత్రం ప్రపంచానికి చూపిందని అన్నారు. అప్పట్లో సర్వస్వం కోల్పోయిన కశ్మీర్​ పండిట్​లు ఇప్పుడు మళ్లీ తమ సొంత ప్రాంతం చేరుకుంటారని, తమ భూములు, ఆస్తులు తిరిగి పొందుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

The kashmir files Collection

కలెక్షన్ల వర్షం..

ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలిరోజు రూ.3.55కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, శనివారం రూ.8.50కోట్లు, ఆదివారం ఏకంగా రూ.15.10కోట్లు రాబట్టినట్లు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ది కశ్మీర్​ ఫైల్స్ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్​ సంస్థ నిర్మించింది. అనుపమ్ ఖేర్​, దర్శన్​ కుమార్​, మిథున్ చక్రవర్తి, పల్లవి జోష్​ అద్భతంగా నటించి తమ పాత్రల్లో జీవించారు. 1990లో కశ్మీర్​ పండిట్​లపై జరిగిన హింసాకాండ, మారణహోమానికి సంబంధించిన పరిస్థితులను కళ్లకుగట్టారు. దీంతో సినిమా చూసిన ప్రతిఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారు.

ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని హరియాణా, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఈ జాబితాలో మరిన్ని రాష్ట్రాలు చేరే అవకాశం కూడా ఉంది.

The kashmir files imdb

ఐఎండీబీలో రికార్డు రేటింగ్..

ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలైన తొలిరోజు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్​లో(ఐఎండీబీ) రికార్డు స్థాయిలో 10కి 10 రేటింగ్ సాధించింది. ఈ స్థాయిలో రేటింగ్ రావడం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఆ తర్వాత రోజు నుంచి రేటింగ్ కాస్త తగ్గుతూ వచ్చింది.

ఇదీ చదవండి:ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే

ABOUT THE AUTHOR

...view details