తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రిష్, వైష్ణవ్ తేజ్ 'కొండపొలం'తో మాయ చేశారా? - వైష్ణవ్ తేజ్ కొండపొలం సమీక్ష

వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధానపాత్రల్లో క్రిష్ తెరకెక్కించిన చిత్రం 'కొండపొలం'. ఈ సినిమా నేడు (అక్టోబర్ 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో సమీక్ష ద్వారా చూద్దాం.

Kondapolam
కొండపొలం

By

Published : Oct 8, 2021, 1:10 PM IST

Updated : Oct 8, 2021, 2:09 PM IST

చిత్రం: కొండపొలం

న‌టులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, అంటోని, రవిప్రకాశ్, మహేశ్ విట్ట, రచ్చ రవి త‌దిత‌రులు

కథ: సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి

దర్శకత్వం: క్రిష్

ఛాయాగ్రహ‌ణం : జ్ఞాన శేఖర్ వీఎస్

సంగీతం : ఎంఎం కీరవాణి

నిర్మాత: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి

విడుద‌ల తేది‌: 2021 అక్టోబర్ 8

తెలుగు తెర‌పై చాలా రోజుల తర్వాత వచ్చిన న‌వ‌లా చిత్రం 'కొండ‌పొలం'. స‌న్నపురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన న‌వ‌ల ఆధారంగా రూపొందించిన చిత్రం. తానా పోటీల్లో ఉత్తమ నవలగా బహుమతి పొందినది కావడం వల్ల 'కొండపొలం' నవలను సినిమాలా ఎలా మలిచారనేది పాఠకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే 'ఉప్పెన' త‌ర్వాత వైష్ణవ్‌తేజ్ న‌టించిన చిత్రం కావ‌డం.. క్రిష్ ద‌ర్శక‌త్వం వహించ‌డం వల్ల సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. మ‌రి 'కొండపొలం' ఎలా ఉందో ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఇదీ కథ

ర‌వీంద్రనాథ్ (వైష్ణవ్ తేజ్‌) గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువ‌కుడు. తండ్రి గురప్ప గొర్రెలను కాస్తూ రవీంద్రనాథ్​ను డిగ్రీ వరకు చదివిస్తాడు. నాలుగేళ్ల నుంచి హైదరాబాద్​లో ఉద్యోగాల కోసం ప్రయత్నించినా రవీంద్రనాథ్​కు అనుకున్న ఉద్యోగం రాదు. తిరిగి ఊరికి చేరుకుంటాడు. క‌రువు వల్ల గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తడం వల్ల రవీంద్రనాథ్ తండ్రి గురప్ప(సాయిచంద్) గొర్రెల్ని మేప‌డానికి కొండపొలం చేద్దామని నిర్ణయిస్తాడు. తాత(కోట శ్రీనివాసరావు) మాటలు నచ్చి తండ్రితో కలిసి రవీంద్రనాథ్ కొండపొలం వెళ్తాడు. ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ఉద్యోగం తెచ్చుకోని రవీంద్రనాథ్​కు అడవి నేర్పిన పాఠాలేంటీ, ఓబులమ్మ(రకూల్ ప్రీతిసింగ్) తో రవీంద్రనాథ్ కున్న సంబంధం ఏమిటి, యూపీఎస్సీలో ఐ.ఎఫ్‌.ఎస్‌కి రవీంద్రనాథ్ ఎలా ఎంపికయ్యాడనేదే కొండపొలం చిత్ర కథ.

కొండపొలం

ఎలా ఉందంటే?

న‌ల్లమ‌ల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఓ యువ‌కుడి సాహ‌సయాత్ర అని చెప్పాలి. వెన్నుముఖ లేన‌ట్టుగా భ‌యం భ‌యంగా క‌నిపించే ఓ యువ‌కుడు.. ఆత్మవిశ్వాసంతో త‌ల‌పైకెత్తి నిలిచేంత ధైర్యాన్ని, త‌న‌పై త‌న‌కి న‌మ్మకాన్ని అడ‌వి, అడ‌విలాంటి ఓ యువ‌తి ఎలా ఇచ్చార‌నేది ఈ సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన అంశం. గొర్రెల కాపరుల జీవిత చిత్రాన్ని తెర‌పై అంతే స‌హ‌జంగా ఆవిష్కరిస్తూ మొద‌ల‌య్యే ఈ క‌థ‌.. అడ‌విలోకి వెళ్తున్నా కొద్దీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. క‌థానాయ‌కుడికి ఎదుర‌య్యే ఒక్కొ స‌వాల్‌.. ఒక్కో వ్యక్తిత్వ వికాస పాఠంలా ఉంటుంది. అడ‌వి ఎంత గొప్పదో, దాన్ని ప‌రిర‌క్షించాల్సిన బాధ్యత మన‌పై ఎంతుందో రవీంద్రనాథ్ ప్రయాణం సాగించే స‌న్నివేశాలు చెబుతుంటాయి. మొదట్లో పిరికివాడిగా క‌నిపించిన క‌థానాయ‌కుడు.. అడ‌వితో మ‌మేక‌మైన‌కొద్దీ ధైర్యశాలిగా మారే క్రమం, నల్లమల్లలో ఎర్రచందనం స్మగ్లర్లను ఎదుర్కొనే సన్నివేశాలు, పులితో చేసే పోరాటం కొండపొలంకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే కొండపొలం నవలలో ప్రతి అంశాన్ని సమగ్రంగా వివరించి, విశ్లేషించినట్టుగా కాకుండా సినిమా సౌలభ్యం కోసం అక్కడక్కడ దర్శకుడు తన ప్రతిభను చూపించాడు. పుస్తకం స్థాయిలో ఉత్కంఠ, భావోద్వేగాలు ఈ సినిమాలో పండ‌క‌పోయినా కొన్ని సన్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. న‌వ‌ల‌లో లేని ఓబులమ్మ పాత్ర సినిమాలో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఆ పాత్ర ఆధారంగా ప్రేమ‌క‌థ‌ను జోడించిన దర్శకుడు.. ఒక రకంగా ఆ పాత్రతో కథానాయకుడి జీవితాన్ని మలుపు తిప్పాడు. ఓబు - ర‌వీంద్ర నేప‌థ్యంలో ప‌తాక స‌న్నివేశాల్లో ఒకింత భావోద్వేగాలు పండాయి.

ఎవ‌రెలా చేశారంటే?

కొండపొలం

వైష్ణవ్‌తేజ్ త‌న న‌ట‌న‌తో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. గొర్రెల కాప‌రుల కుటుంబానికి చెందిన యువ‌కుడిగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. సీమయాస ప‌లికిన విధానం కూడా మెప్పిస్తుంది. పులితో చేసే పోరాట ఘ‌ట్టాల్లోనూ, క‌థానాయిక‌తో వచ్చే స‌న్నివేశాల్లోనూ వైష్ణవ్ నట‌న ఆక‌ట్టుకుంటుంది. ఓబుల‌మ్మ ర‌కుల్ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. సాయిచంద్‌, ఆంటోని, రవిప్రకాశ్, కోట శ్రీనివాసరావు, మహేశ్ పాత్రలు తమ పరిధి మేరకు బాగా ఉన్నాయి. మాటలు, పాటలు సినిమాకు ప్రధాన బలమని చెప్పాలి. రచయిత సన్నపురెడ్డి మాటలు, కీరవాణి సంగీతం పోటీపడతాయి. ర‌య్ ర‌య్ ర‌య్యారే అంటూ స‌మ‌కూర్చిన నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌కి ఊపు తీసుకొచ్చింది. అడవిలో జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ మరింత బాగా తీర్చిదిద్దాల్సింది. అలాగే న‌వ‌ల‌ని సినిమాగా మ‌లిచే క్రిష్ ప్రయ‌త్నం అభినందనీయం. 300 పైజీల పుస్తకాన్ని రెండున్నర గంటల సినిమాగా తీర్చిదిద్దిన విధానంలో క్రిష్ అనుభవం కనిపిస్తుంది. కథనాన్ని, పాత్రల మధ్య భావోద్వేగాలను మరింత దృష్టిపెడితే బాగుండేది అనిపించింది.

కొండపొలం

బ‌లం

అడ‌వి నేప‌థ్యంలో సాగే క‌థ, సందేశం, వైష్ణవ్ తేజ్ నటన, కీర‌వాణి సంగీతం, ప‌తాక స‌న్నివేశాలు

బలహీనత

నిదానంగా సాగే కొన్ని స‌న్నివేశాలు

భావోద్వేగాలు

చివ‌రిగా: అడవితల్లి నేర్పే వ్యక్తిత్వ వికాస పాఠం.. కొండపొలం

Last Updated : Oct 8, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details